Thursday, February 25, 2010

ఆమె ఎవరు..?

ఆమె ఎవరు..?
ఇంనిన్ని భావాలకు
ఊపిరి పోస్తూ..!
---------------
ఆమె సరేలే
అనగానే కవిత
పొంగి పొర్లింది.
---------------
ఆమె లేకుండా
అక్షరావిష్కరణ
వల్ల కాలేదు.

ఎటో తీస్కెళ్ళి..!

ఏటి ఒడ్డున సాయంకాలపు గాలి ఎటో తీస్కెళ్ళి..! ---------------
గోదారి ఒడ్డు తోడొచ్చిన పడవ ఎటోతీస్కెళ్ళి..! ---------------- తెరచాపలు చెలరేగుతూ గాలి ఎటో తీస్కెళ్ళి..!

Wednesday, February 24, 2010

కొమ్మను ..

కొన్ని మొగ్గలూ
ఒక పువ్వు -కొమ్మను
అమ్మను చేస్తూ..!
-------------
పూలగుత్తులు
నేలపై తారాడుతూ
సేదతీరుతూ..!
----------
మంచుపువ్వులు
ఆకు అరచేతిలో
ఉండిపోనివ్వు..!

అమ్మ ..

అమ్మకు..
పెంకుటిల్లు ..తాజ్ మహల్
వంటిల్లు..రాజధాని
పెరట్లో బృందావనం
వరండా ..ఊరందరికీ ఇల్లు
పని వొత్తిడిలో ..దీపస్తంభం
వెళ్ళిపోయాక ..ఆమె సర్వాంతర్యామి ..
-------------------------
మిత్రుడు /కవి ..స శ్రీ కి
-------------------------

Tuesday, February 23, 2010

విల్లంబు..

వొంగి ఉన్నానంటే
నీకు లొంగి ఉన్నానని కాదు అర్ధం..
విల్లంబునౌతున్నానని అర్ధం.
నీవైపే ..గురి పెట్టబడుతున్నానని అర్ధం.

Monday, February 22, 2010

పిల్లలా .? పోయిట్రీ నా..?

నీకు
పిల్లలు ఇష్టమా ..పోయిట్రీ నా ?
రెండూను..
పిల్లల్ని చూడు ..
వాళ్ళ కళ్ళల్లో ..నా కవిత్వం ధగ ధగా మెరుస్తోంది ..!
కవిత్వాన్ని చూడు ...
ప్రతి అక్షరంలో ..పిల్లలు మిల మిలా మెరుస్తున్నారు..!!

Saturday, February 20, 2010

వెండి వెన్నెల- ఆరు హైకులు

మంచు రేణువు
పచ్చని చిగురాకు
హైకు మెరుస్తూ ..!
.........................
ఏటి అలలు
చిరుగాలి పాటలు
హైకు చేరింది.
.........................
గోరింటాకు
పాప చిట్టి చేతులు
హైకు పండింది.
.......................
వెండి వెన్నెల
చల్లని రాత్రి జోల
నిద్రలో హైకు.
....................
అక్షరాలకి
కవిత్వాన్ని అద్దితే
వచ్చింది హైకు.
....................
అ ఆ యి ఈ లు
దిద్దుకుంటున్న పాప
కావ్యమై హైకు.
........................
అక్షరాలకి
కవిత్వాన్ని అద్దితే
వచ్చింది హైకు.
......................


బాల్యం..

బాల్యం
నేను చాన్నేళ్ళ క్రితం
పారేసుకున్న బొమ్మ.
--------------
జీవన కావ్యం
మొదలయింది
ముందుమాట బాల్యానిదే ..!
---------------
బాబుకి
అంతా నాపోలికే ..
నా బాల్యం నన్నల్లుకుంటోంది.
--------------------

Thursday, February 18, 2010

తెగిన చెప్పు..!

తెగిన చెప్పు..!
నా బ్యాంకు బాలన్సుని
తెగ చెప్తోంది.
---------------
తెగిన చెప్పు
ఎన్ని కుట్లు పడినా
బాధపడదు.
--------------------
తెగిన చెప్పు
ఆమె నవ్వి లోపల
విడవమంది .
-------------

Wednesday, February 17, 2010

ఆమె మరీను.!

ఆమె మరీనూ..!
కొన్ని అక్షరాల్నిచ్చి
హైకు ఇమ్మంది.
-------------
ఆమె వెళ్ళింది
కొన్ని చరణాలకి
పల్లవి నిచ్చి.
--------------
ఆమె రాలేదు
ఇప్పుడు కవిత్వంగా
ఉన్నట్లు ఉంది.
---------------

Tuesday, February 16, 2010

గది లోపల..!

అంతపెద్ద ఆకాశంనించి
చందమామను దించి
కొన్ని నక్షత్రాలను తుంచి
పాపాయికివ్వలనుకున్నా .!
.....అర్ధరాత్రి వెళ్లి చూస్తే
అసలు ఆకాశమే లేదు ..
తీరా నా గదిలోపల కెళ్ళి చూస్తే
పాపాయి ఆడుకుంటోంది
చందమామతోనూ
కోటి నక్షత్రాలతోనూ..!

Saturday, February 13, 2010

మరికొన్ని మల్లెలు..!

నేల రాలాయి
తీగచాటు మల్లెలు
తీరింది ఋణం.!
----------------
ఒంటరి మొక్క
ఒక్క మొగ్గను వేసి
తెగ పూస్తోంది .
------------
మల్లె రాలింది
మనసదోలా ఉంది
మొగ్గ-ఓదార్పు.
-------------

కొన్ని మల్లెలు..!

మల్లెనవ్వింది
ఆమెమళ్ళీనవ్వింది
బావుందీ రోజు..!
-----------
మల్లెలువిచ్చి
కవికేదో ఇచ్చాయి
హైకూలు నచ్చి..!
-------------
తీగ సాగుతూ
దేన్నో వెతుకుతోంది
మొగ్గ నవ్వింది.
---------

Thursday, February 11, 2010

ఎన్ని మల్లెలో..!

మల్లె పువ్వులు
పాపనవ్వులు --చాలు
హైకు కవికి .
_____________
నేను నవ్వాను
ఆమె కూడా నవ్వింది
ఎన్ని మల్లెలో..!
_____________
మూర మల్లెలు
మనసు మూలల్ని
వసంత పర్చాయి .
____________

Wednesday, February 10, 2010

ఉంటాననే..! హైకూ ..

ప్రాణ మిత్రుడు
ఉంటాననే వెళ్ళాడు
గుండెను పిండి !
***********
కవి మిత్రుడు
ఉంటానంటూ వెళ్ళాడు
హైకూ ఓదార్పు..!
***********
ఆమె వెళ్ళింది
ఉంటాననే చెప్పింది
ఎప్పటిలానే..!

Monday, February 8, 2010

ఆమె చూపులు..!

* ఆమె చూపులు
వెచ్చని చెలిమిని
పంచి ఇచ్చాయి..
***
* ఆమె చూపులు
మనసు లోతుల్లోకి
దిగుతున్నాయి.
***
* ఆమె చూపులు
కలసిన చోటల్లా
కావ్య సుధలె..!
***
* ఆమె చూపులు
నేనుని చెరిపేసి
మనమే నంటూ ..!
***
* ఆమె చూపులు
కొన్ని కవితలకి
ముగింపు నిస్తూ ..!
***
* ఆమె చూపులు
పొంగుతున్న చీకట్ని
వెన్నెలించాయి .

Sunday, February 7, 2010

మా అమ్మాయి ..

మా అమ్మాయి
------------
మా అమ్మాయికి
ఓ ఘంటసాలా.. సుశీలా లేరు
బాలమురళినా? ఎక్కడో విన్నట్టు గుర్తు
రవివర్మ ? ..పేరు బాగుందే
బిస్మల్లఖాన్..! ...ఓ ముస్లిం కదూ
సుబ్బులక్ష్మి.. ఇదేమి పేరు?
మాయాబజార్? రైతుబజార!
****------****-----***
మా అమ్మాయికి ...ఇప్పుడంతా--
ఇంటరు నెట్లు ..చాట్లూ
సెల్లులు ..ఎస్సేమ్యేస్సులు
లాపు టాపులూ..ఇపాడులు..
పబ్బులూ ..ఫాస్ట్ బీట్లూ
కంప్యుటరులో గేములూ ..పైరసీ సీడీలు
మా అమ్మాయికి కొన్ని లేవు..!.
లేనివి ..అపురూపమైనవి ..
ఉన్నవి..? నో కామెంట్..
--

Wednesday, February 3, 2010

వెన్నెల ..!

చప్పుడు లేని చీకటి
మౌనాన్ని దిగమింగుతూ గది
మూలగా దీపం వెలుగుతూ ..
లీలగా ఆమె రూపం ..దీపం వెల్తుర్లో ..
వెనుక అగరొత్తుల పొగ సాగుతూ
వొత్తైన ఆమె కురులని సర్దుతూ అతని వేళ్ళు
మెరుస్తోన్న చెమట చుక్కల్ని తుడుస్తూ ముని వేళ్ళు
కరుగుతున్న కుంకుమ అతని వేలిపై
గోడపై రెండు నీడలు --ఒకటి ఔతున్నట్లుగా
అదిరిపడే పెదవులు మెల్లగా ముడుచుకుంటూ
పెదవులపై తారాడుతూ పెదవులు
మళ్ళీ దీపం వైపు ...
దీపం మెల్లగా వణికి పోతూ
మెల్లగా వెలుగు చీకట్లోకి జారుతూ
ఇంకా మెల్లగా చీకటి వెలుగులో కరుగుతూ
మెల్లగా సాగే నల్లని మబ్బేదో
వేల్లువౌతున్న వెన్నెల్ని
మృదువుగా ముంచేస్తూ..

-



వెన్నెల్ని మృదువుగా ముంచేస్తో..


Tuesday, February 2, 2010

రాత్రి ఏం చేస్తుంది?

* రాత్రంతా రాత్రి ఏం చేస్తుంది?
రేపటి ఉదయాన్ని రాగ రంజితం చేయడాన్కి
తాపత్రయ పడుతూ ఉంటుంది.
-------------------------
* కనురెప్పల దూరం -ఇంత
కనువిప్పుకు లోకం -అనంత
--------------------------
*కలం - నా హలం
కాగితం - నా పొలం
కవిత -అందరి ఫలం
--------------------------

ఏ కవి చల్లాడో

* ఏ కవి చల్లాడో
వేల అక్షరాలు
నెల పచ్చని కవితనిచ్చింది .
------------------
* పంజరాన చిలక
అటునిటు తిరుగుతూ
రెక్కలకి అర్ధం వెతుకుతోంది.
----------------------
* గొంగళి పురుగుకి
నిద్ర చెడింది - రంగుల కలలన్నీ
రెక్కలు విప్పుకున్నాయి.
-----------------------
*చెట్టు కూలింది ..!
నేలతల్లి నీడను కోలు పోయింది

చిలకలన్నీ జ్ఞాపకాల్లో.
-----------------