Friday, April 29, 2011

చిన్న చిన్న అలలు

రెండుకొండల మధ్య
పడవ మెల్లగా వెళ్తోంది
చాన్నాళ్ళ గాయాలని మోసుకొంటూ ..
అన్ని తీరాలలోనూ
నెత్తురోడుతున్న జ్ఞాపకాలే.....!
కంట తడి అంటని కొత్త జ్ఞాపకాలని వెతుక్కుంటూ
ఓ చోట ఆగి దోసిళ్ళలో నీరు తీసుకున్నాను.
కొన్ని చిన్ని చిన్ని అలలు
నా ప్రతిబింబాన్ని తమ ఒడిలోకి తీసుకొని
తల నిమురుతున్నాయి.
ఈ చిన్ని లాలన చాలదా ..నా పడవ ప్రయాణానికి ?
జ్ఞాపకాల గాయాలు మానడానికి??

Friday, April 22, 2011

వెన్నెల

దొసిళ్ళనిండా వెన్నెల --
దారి చూపెడుతూ నక్షత్రాలు--
ఊరవతల వెంటాడే ఒంటరితనం--
తోడుగా తాడిచెట్ల బారాటి నీడలు --
నల్లటి రాత్రిని తుడిచేస్తూ చంద్రుడు--
తెల్లవార్లూ వెన్నెలని దాచిపెట్టి-
ఆడుకునే పాపకిచ్చాను --
పాప నవ్వులముందు
వెన్నెల వెల వెల బోయింది --
నా ఒంటరి తనాన్ని చీకట్లోకి విసిరేసాను.

Thursday, April 14, 2011

హైకులు

* చిరుగాలికి వేణువు కదిలింది పాత పొంగింది . ** లేత చిగురు ఎండిన కొమ్మలకి మరో కానుపు. *** చెమట పువ్వు ఆమె నుదురు మీద పరిమళిస్తూ..

Sunday, April 10, 2011

పరిమళించే కవిత ..

మా అమ్మాయికి నా కవితలని చూపించాను మీరేనా రాసింది ? అన్నది. అన్నీ చదివాక చిన్నగా నిట్టూర్చింది. తన స్కూల్ బ్యాగ్లోంచి కొన్ని కాగితాలని తీసి ఇచ్చింది. వాటి నిండా కవిత్యమే..! ఎవరు ముందు రాసారు? చాలామంది మిత్రులు అంటూ ఉంటారు అమ్మాయికి అంతా నా పోలికేనని.. నాలానే కవిత్వం రాసిందా..? ఇద్దరవీ ఒకేలా ఎలావుంది..!! ఏమైనా సరే .. మా అమ్మాయిదే కవిత్వం.. నేను యాభై లో రాసాను. తను పదహారేళ్ళకే రాసింది. తన కవిత్వం పరిమళిస్తోంది