Tuesday, June 29, 2010

కొంత రాత్రయ్యాక ..

కొంత రాత్రయ్యాక చూస్తే
చంద్రుడూ లేడూ..చుక్కలూ లేవు.
చెట్లనిండా ఆవరించిన చీకటి
నేలమీద జారుతోంది.
రేకులనిండా దాచుకున్న వెన్నెలని
ఎవరికైనా ఇవ్వడానికి l
ఓ మల్లెమొగ్గ తహతహలాడుతోంది .
కొంత సేపయ్యాక చూస్తే
రెప్పల చప్పుళ్ళకి ఉలిక్కిపడెంత నిశ్శబ్దం .
అంత నిశ్శబ్దం లోనూ
రాత్రి తెగ తాపత్రయ పడుతోంది..
రేపటి ఉదయాన్ని
రాగరంజితం చేయడానికి.

Sunday, June 20, 2010

ఆ క్షణం

ఉన్నపాటి కొద్ది స్తలంలో
ఓ పూరిపాక ఉండేది.
ఓ దీపం ఉండేది.
నా ముద్ద నేను తినేవాడిని.
కాల గమనం లో అక్కడో భవంతి కట్టాను.
గర్వంగా తలెత్తుకొని వెళ్తే
గుమ్మం తగిలి తలకి బొప్పికట్టింది.
ఎంతకూ తగ్గని నొప్పిని భరించలేక
స్కానింగ్ తీస్తే,
తలలో రక్తం గడ్డ కట్టిందన్నారు.
ఆలోచనలేమీ పెట్టుకోవద్దన్నారు.
.....కానీ
పూరిగుడిసె గుర్తుకొచ్చింది.
దాన్లోని దీపం గుర్తుకొచ్చింది.
నా ముద్ద గుర్తుకొచ్చింది.
తలను వొంచి
నా మానాన నేను బతికిన ఆ క్షణం గుర్తుకొచ్చింది.
'ఈ ఒక్క లక్షణం చాలు
ఎవరైనా మళ్ళీ బతకడానికి' అంటున్నారు .

నది ..అలల సవ్వడి

నది ఆవలి గట్టున ఇల్లు .
అక్కడో దీపం దిగులుగా వెలుగుతోంది .
ఓ అనివార్యపు ఒంటరి సాయంత్రంలో
ఇవతల నేను .
.....నీళ్ళు లేని నది
..... కదలని పడవ
..... గాఢమైన నిరీక్షణ
నదిలోకి నీళ్ళు చేరాలి
అలల అరచేతుల్లో పడవ తేలాలి
ఆవలి ఒడ్డుకు చేరాలి...
అప్పుడు కదా
వాకిట్లో నిలబడి
అలల సవ్వడి వింటూ
నది నుదుటిపై
సూర్య కాంతిని చూడాలి!??
..... ఓ
చినుకు పడింది.
ఇప్పుడు మీకు
నది వస్తున్న చప్పుడు వినబడుతోందా??

Wednesday, June 16, 2010

లేకపోతె..

ఎక్కడినించో
నీళ్ళల్లో కొట్టుకొచ్చిన చీమకి,
ఒడ్డునున్న గడ్డిపోచ
చేయిన౦ది౦చాక..........
-----ఈదురుగాలుల్ని తట్టుకొని
బెదురు చూపుల్తో
ముళ్ళ క౦చలొ చిక్కడిన పిచ్చుక పిల్లకి
పక్కనే పచ్చని గుబురు కనిపించాక .......
------చెలరేగుతున్న ఒ౦టరితనపు మ౦టలతో
విసిగి వేసారినప్పుడు చల్లటి సహచర్యపు
సెలయేటి అలల గలగలలు వినిపించాక.......
ఎవరికీ ఎవరైనా
లేకపోతె నేమి..?
ఒకరికి ఇంకొకరు తోడైనపుడు ...!

Sunday, June 13, 2010

వెతుకులాట ..!

చీకటికి భయపడి
కల్లుమూసుకున్నవారు ,
తళ్ళత్తళ్ళల దివ్య నక్షత్ర కాంతిని
కోల్పోయారు కదా..!
........నిజానికి భయపడి
........వొంగి వొంగి నంగిగా నడిచేవారు,
........అబద్ధపు అశుద్ధ కొలిమిలో
........తగలబడి పొయారుకదా...!
---ఈ రెండింటికీ భయపడక
ఎదురు నిలబడి
జీవితపు అట్టడుగు పొరల్లోని
శూన్యతరంగాల్కి --దివ్య సంగీతాన్ని చేర్చి ,
కొన్ని పాటల్ని కట్టి వెళ్ళారు కదా..!
ఏ ఒక్క పాటైనా
గొంతులో చిక్కడితే
బ్రతుకంతా పాడుకోడానికి
వెనుకాడని క్షణం కోసం .....
ఈ వెతుకులాట...!!!

Friday, June 11, 2010

నీలి తామరలు

అప్పుడేం జరిగిందంటే ....
ఆకాశం మెల్లగా ప్రవహించి
అలవోకగా కోనేటి
అలల్లో వొదిగింది.
---------నీలి తామరలు ఇంకా మెల్లగా
రేకులన్నీ విప్పుకొని
నింగి వైపు చూస్తున్నాయి.

క్షణ కాలంలో ...కాలం
నీలంగా మారి
ఎవరినైనా సరే ...
తనలోకి వొంపు కోవాలని చూస్తోంది.
....కోనేటిలో
.... కొన్ని నీలి తామరల ప్రతిరూపాలు
.... నన్నెందుకు రమ్మంటున్నాయి..!!??

Wednesday, June 2, 2010

చూపులు

తలవాకిట్లో
అమ్మ కళ్ళాపుజల్లి
అలికి ముగ్గులేసినపుడు
నా చూపు
ఓ చుక్కకు గుచ్చుకుంది .
నుదుటిమీద పడే కురుల్ని
అర చేతిని తిరగేసి
అమ్మ-పైకి సర్దుకున్నపుడు
నా చూపు
చిరుచెమటలో తడిసినది.
నా చూపులన్నీ
అక్షరాలకి పెనవేసి
వొకానొక వేకువలో
నన్ను తన చేతుల్లోంచి
నేలమీదకు దించిందని
అమ్మ చూపులు
మసకబారాక తెలిసింది .