Thursday, February 17, 2011

ముగ్గు

ఆమె చూపుడువేలుకీ
బొటనవేలుకీమధ్య
నువ్వు ముగ్గుపిండివైతేచాలు..
చుక్కలు చుక్కలుగా పడుతున్న నిన్ను
తనవైపు కలుపుకుంటుంది...!
ఆమె కోపానికీ
చిరు అలకకీ మధ్య
నువ్వు మౌనంగా ఉంటేచాలు..
పక్కన పక్కన చేరి నిన్ను
తనవైపుకు తిప్పుకుంటుంది ..! !

Wednesday, February 16, 2011

పుస్తకాన్ని మూస్తే..

పుస్తకాన్ని తెరవాలంటే
ముందు మూసుకున్న నన్ను నేను తెరుచుకోవాలి.
అక్షరాల వెంబడి చూపులు సాగాలంటే
తక్షణం నాలోని బద్ధకపు క్షణాలని తగలబెట్టాలి .
అప్పుడే కదా
నిశ్శబ్దాన్ని శ్వాసిస్తూఅరచేతిలో పుస్తకం
ప్రాణం పోసుకుంటుంది..!
చాలావరకు చదివింతర్వాత
ప్రపంచం బొచ్చుకుక్కపిల్లలా
నా కాళ్ళదగ్గర 'కూతు కూతు'లాడుతుంది..!
పుటలు తిరగేస్తున్నకొద్దీ నా చేతి మునివేళ్ళ మీద
సూర్యోదయం కొత్త కొత్త కాంతుల్ని అద్దుతుంటుంది
ప్రతి శీర్షికా కవి హృదయాన్ని ఆవిష్కరిస్తూ
దివా రాత్రుళ్ళలో కవనపరిమళాల్ని
నాముంగిట్లోనింపుతుంది.
నాచుట్టూ ఎవరో తచ్చాడుతున్నట్లుగా
చాలాకాలపు ఒంటరితనాన్ని సవాలుచేస్తూ
కొన్ని బారాటి నీడలు పరచుకుంటాయి.
పుస్తకాన్ని మూసిన ప్రతి సారీ
నన్నెవరో యధేచ్చగా పరిచయం చేస్తున్నట్లుగా ఉంటుంది.
భుజం మీద ఆప్యాయంగా చేయి వేసినట్లుగా ఉంటుంది.
అడుగుతీసి అడుగు వేసినప్పుడల్లా
ఎవరివో అరచేతులు
నా పాదాల కింద చేరుతున్నట్ట్లుగా ఉంటుంది.
పుస్తకాన్ని మడిచిన ప్రతిసారీ
నా గమనం సుగమమై
గమ్యం సుస్స్పష్ట మౌతుంది.
వాక్యానంతర చుక్క దగ్గర
నన్నెవరో విడమరచినట్ట్లుగా ఉండేది.
అర్ధమౌతున్న కొద్దీ
నాకు నేనే అన్తుబడుతున్నట్ట్లుగా ఉండేది.
కొన్ని పదాల మధ్య విరామంలో
అంతర్యుద్ధాని చూసేవాడిని.
పుస్తకాన్ని మూయాలని పించదు.. .
మూయకపోతే
నేనెలా తెరచుకుంటాను.!!?

Thursday, February 10, 2011

ఆకు రాలినప్పుడు

ఆకురాలినప్పుడు
కొమ్మలన్నీ ఊగిపోయాయి..
పూవురాలినప్పుడు
రెమ్మలగుండెలు ఆగిపోయాయి...
కొమ్మ విరిగినప్పుడు
చెట్టుమొదలుకదలిపోయింది...
చెట్టు కూలినప్పుడు
నేల పొత్తిళ్ళ తడి పొంగిపొర్లింది...
....ప్రతిసారీ
పక్షుల రెక్కలు అల్లల్లాడుతున్నాయి ......
దిక్కుతోచని
చెదరిన గూడు కళ్ళల్లో
చెట్టు ఇంకా కదలాడుతోంది..!

Thursday, February 3, 2011

ఒక చినుకు

స్నిగ్ధ సౌందర్యంతో తళుకులీనుతూ జ్వలించేకళ్ళతో మత్తిల్లుతూఆమె అర్ధనగ్నంతో ఒకవైపు వోత్తిగిల్లినప్పుడు కోటి నక్షత్రాలు వికసించి వెల్లివిరిసిన పున్నమివెన్నలకిసవాలుగా నిలిచాయి.విప్పారిన పూలతీగల తాకిడికి నిలువెత్తుగోడలుఓ పక్కకి వొరిగి నేలకుభారంగా నిలిచాయి. చిరుగాలి ఆమె నల్లని కురులని కదల్చి చీకటి చేతిలో ఉంచి ఎటో వెళ్ళిపోయింది. వెచ్చని ఆమె శ్వాసలో ఆవిష్కరించబడ్డ నీలి ఆకాశం రెండు మబ్బుతునకల్ని కానుకగా పంపించింది. ఒకచినుకు,రెండుచివురులు ,పూలకొమ్మలు,వాలితూలిపోతున్న తుమ్మెదలు,రెక్కలరా ఎగురుతున్న సీతాకోకలు,ఒక కోకిల పాట ఆన్నింటినీ ఆమె ఓరగా గమనించి పలకరించాకుండానే గడ్డిపోచని దానిమీద మెరుస్తోన్న మంచు బిందువుని వేలికోసల్తో నిమిరి వెళ్ళిపోయింది ..అనంతమైన ఒంటరితనాన్ని దోసిళ్లకొద్దీ నా చుట్టూరా పోసి..!