Friday, May 20, 2011

తెలియని చోటుకి

ఉండటం
లేకపోవటం
రెండూ నిజమైన అబద్దాలే ..!
ఎంత ఉండాలనుకున్నా
లేకుండాపోయిన సందర్భాలేన్నిలేవూ..?
లేకుండా ఉండాలని
ఎంత ప్రయత్నించినా
ఉండలేక నిట్టూర్చిన సమయాలేన్నిలేవూ..?
ఉండటం-లేకపోవటం
రెండుతీరాలు ప్రాణనదికి..
నదేలేనప్పుడు
తీరాలు నిస్సహాయంగా
ఉండీ లేనట్టుగా ఉంటాయి.
తీరా ఇప్పుడు తీరాలు లేవు.
నది ఉన్నా లేనట్టుగా
తెలియని చోటుకు ప్రవహిస్తోంది.

అక్షర మోహనం: దాచుకున్న రెక్కలు

అక్షర మోహనం: దాచుకున్న రెక్కలు

Wednesday, May 18, 2011

దాచుకున్న రెక్కలు

మా అమ్మాయికి వాళ్ళమ్మ తలదువ్వి
నోట్లో ఇంత కుక్కి
బండెడు బరువు భుజాన పడవేసి
బడికి పంపుతుంది.
ఇల్లు వదిలి
కొంత దూరం వెళ్ళాక
మా అమ్మాయి
బరువునంతా ఒక చోట పడవేసి
దాచుకున్న రెక్కల్ని నెమ్మదిగా బయటకు తీసి
పక్షులతో కలసి ఎగిరి ఎగిరి
ఆనందంగా అలసి పోతుంది.
చెరువునిండా విచ్చుకున్న కలువ పూవుల్ని
కళ్ళారా చూసి
మనసారా పలకరించి
ఎన్నో జ్ఞాపకాలని
తన స్నేహితులకోసం దాచిపెడుతుంది.
పచ్చని పొలాల గట్లమీద
పాదముద్రలు ముగుల్లా వేసుకుంటూ వెళ్తుంది.
రొజూ ఇదే తంతు..
పరీక్షలోచ్చాయి..
మా అమ్మాయికి నూటికి నూరు మార్కులు -లెక్కల్లో.
వాళ్ళ అమ్మ
ఇరుగమ్మకి- పోరుగమ్మకి
తెగచేప్పుతుంటుంది .
-----లెక్కల్లో మార్కులు చెప్పుకుంటూ మా ఆవిడా ..
-----రెక్కలు దాచుకుంటూ మా అమ్మాయి.

దాచుకున్న రెక్కలు ..

Tuesday, May 17, 2011

మనసు మూలల్లో

చందమామని కనురెప్పల్లో
దాచిపెట్టి చూడు...
మబ్బుల్లోంచి తొంగిచూసి పలకరిస్తుంది.
వెన్నెల్ని దోసిళ్ళలో
మూసిఉంచు...
కనుకోసల్లోంచి పొంగి వస్తుంది.
దేన్నైనా..ఎవరినైనా
ఎదురుగా చూడడంకంటే
మనసుమూలల్లో దాచుకొని చూడు..
నువ్వెంత కాంతివంతంగా మెరుస్తావో..
అర్ధవంతంగా మిగుల్తావో..