Sunday, March 6, 2011

తీరని దాహం

నా లోపల ఓ మొక్కను నాటాను
కొంత కాలానికి అది చెట్టయింది
ముందు కొన్ని ఊ హాలు పూచాయి
అవి సీతా కోక చిలుకలతో జతకట్టి ఎటో ఎగిరిపోయాయి ..!
కొన్నాళ్ళకి పూలు గుత్తులు గుత్తులుగా పూచాయి
అవి పరిమళిస్తూ కొత్త రంగులిని కోరుకుంటున్నాయి ..
రోజూకొన్ని పక్షులు వాలుతున్నాయి
అవి నిరంతరం గుసగుసలాడుతున్నాయి
బహుశా : కవిత్వంలోని కొత్త కొత్త సంగతులను కొంటా...!!
ఒక కోకిల కొత్త కవులిని పిలుస్తోంది
కొంతమంది కవులు
నా చెట్టు నీడన చేరారు ...
'కవిత్వం' అనేది ఏమీ చెప్పలేదు కానీ
కన్నీటిభాషలో మనసులోని మనిషిని తడుముకున్నారు ..
'కవిత్వమొక తీరని దాహం ' అని గొణుక్కుంటున్నారు ..
నాలోపల చాలా మొక్కలు నాటాను
చాలా మంది కవులు
నన్నూ, నాచెట్టుని ప్రశ్నిస్తున్నారు
ఈ దాహం తీరేదెప్పుడని ...??

Friday, March 4, 2011

ముళ్ళపూడి వెంకటరమణ గారి స్మృతిలో..

రమణగారి పెన్ను
తెలుగుభాషకి వెన్ను
నిలబెట్టేను నిన్ను నన్ను
ఓ గోదారమ్మ ...!
కనులు మూసిన బొమ్మ
రమణ గారిదేనమ్మ
బాపు గీయలేరమ్మ
గోదారమ్మ ...!
రమణగారి బుడుగు
అసలుపేరు అల్లరి పిడుగు
మనసే౦టో మల్లెపువ్వునడుగు
గోదారమ్మ...!
కోతికొమ్మచ్చి
తెలుగువాళ్ళ కిచ్చి
చదు౦కొమన్నారు గిచ్చి
ఓ గోదారమ్మ ...!
భట్టుగారి అట్టు
రమణగారు తిన్నట్టు
తెలిసాక తెలిసి౦ది పెసరట్టు గుట్టు
గోదారమ్మ...!
చిన్నమాటకి తల౦టెను
పాపిట తీసి బొట్టు పెట్టెను
రె౦డుజెళ్ళ సీత అని పేరెట్టెను
గోదారమ్మ...!
మాటలని మూటకట్టి
మన గుండెలో దాచిపెట్టి
రమణ వెళ్ళారు పెన్ను పక్కనెట్టి
ఓ గోదారమ్మ...!
'స్వాతి ' ఈ వారం పత్రికలో పేజి ఆరు లో ప్రచురణ

Tuesday, March 1, 2011

తలుపులు తీసి ..

తలుపులు తీసి
ఆమె నవ్వుతూ ఎదురౌతుంది.
దోసిట్లోంచి చందమామలు కొన్ని
ఇల్లంతా చెల్లాచెదురుగా దొర్లుతుంటాయి.
ఒక సీతాకోకచిలుక
ఆమె జడలో మల్లెపూలపై వాలి
వెళ్లాలనిపించక రెక్కలు దాచుకుంటుంది.
పిల్లలు నన్నల్లుకొని
నా కాళ్ళ దగ్గర పూలతీగలల్లె
పరిమళిస్తూ ఉంటారు.
రేపటి బరువు
దూదిపింజలా
రెప్పలమీంచి ఎగిరిపోతూ ఉంటుంది.
ఆకాశం ఆమె అరచేతిలో
వెన్నెల్ని గోరింట పెడ్తుంది.
సంధ్య కా౦తుల్లొ ఆమె గోరింట చేతులు
నన్ను వివసుడిని చేస్తాయి. .
మళ్ళీ మళ్ళీ తెరచుకునే తలుపుల కోసం
ఎదురయ్యే ఆమె నవ్వు కోసం
నేను బయటకు తప్పనిసరిగా వెళ్తాను.