Monday, November 28, 2011

ఎప్పటిలానే...!

ఎప్పటిలానే...!


ఎప్పటిలానే


రాత్రి


ఒక చ౦దమామని కోటి కోటి నక్షత్రాలని


దోసిళ్ళతో తెచ్చి నాకిచ్చి౦ది.


నేను రాత్రికి వెన్నెల్లో పెట్టి ఓ కవితనిచ్చాను.


************


ఎప్పటిలానే


ఉదయ౦

బోలెడు కమలపూలని


కోనేటిని౦డా పూయి౦చి


లేతకా౦తుల్ని మాపాప కళ్ళల్లో ని౦పి౦ది.


మాపాప తన చిట్టిచేతులతో


ప్రతిపొద్దుకీ గోరి౦ట అద్ది౦ది.


****************


ఎప్పటిలానే


వస౦త౦


మాగున్నమావి గుబురుల్లో


చిగురాకుపచ్చని గుట్టు ఏదో దాచివు౦చి౦ది.


దాన్ని పసిగట్టిన మాకోకిల


తెల్లారగానే పాట కట్టి ఊర౦దరికి విన్పి౦చి౦ది.

Friday, November 25, 2011

రాత్రి వెళ్తూ వెళ్తూ





 తొలిసంధ్య వెళ్తూ వెళ్తూ
అరుణ కిరణాలతో
చిగురాకుల అంచుల్లో
మంచు బిందువులకి
కిరీటాలని తొడిగింది.
ఇంతలోనే పిల్లలు చెట్టుకింద చేరి
కొమ్మల్ని ఊపి ఊపి
కిరీటాల్ని తొడుక్కెళ్ళారు.

సాయంసంధ్య వెళ్తూ వెళ్తూ
మాఊరి కోనేట్లో
విచ్చుకుంటున్న ఎర్రకలువలకి
ఏదో చెప్పి వెళ్ళింది.
పిల్లలంతా గోచీలు విసిరేసి
కోనేట్లో దూకారు .
సంకనిండా కోటి కలువలతో
ఊరంతా ఊరేగారు.


రాత్రి వెళ్తూ వెళ్తూ
కొన్ని నక్షత్రాలని
మా ఊరి బావిలో చల్లింది.
తెల్లారి పిల్లలు చుట్టూరాచేరి
గులకరాళ్ళు విసిరి చెల్లాచెదురు చేసారు.
 కొన్ని నక్షత్రాలు వాళ్ళ కళ్ళల్లో
ఇప్పటికీ మెరుస్తున్నాయి.

Wednesday, November 9, 2011

మట్టికి తగిలిన గాయం

అంత చెట్టునూ
కొమ్మలు కొమ్మలుగా కొట్టేసి పడేయడమంటే
చెట్టునోక్కదాన్నే కోల్పోవడం కాదు..!
చల్లటి నీడల్ని చేరిపెయడమే..
పిల్లల ఆటల్ని ఆపేయడమే..
పక్షి గూడును చెదర గొట్టడమే..
వాటి గుసగుసల్ని కొల్లగొట్టడమే...
లేలేతచిగురాకుల చివర్లో మెరిసే
చిన్ని చిన్ని సూర్యళ్ళని
చీకట్లోకి నేట్టేయడమే..
కురిసే వానకి  కొమ్మలు లేకపోవడం
అలసిన బాటసారికి చెట్టు చేరువ లేకపోవడం
ఓ చేదు అనుభవం.

గుబురుకోమ్మల్లోంచి
నడిరాత్రి చంద్రుణ్నిచూడటం ,
తోలివేకువలో నునులేత రెమ్మలపై
లోకాన్ని జయి౦చేలా మంచుబిందువులు మెరవడం
ఓ మధుర అనుభవం.

ఇప్పుడు చెట్టు లేదుకదా!
చిరుగాలి గల గలల్ని ఎలా వినడం ?
సీతాకోకలకి మరిన్ని పువ్వుల్ని ఎలాఇవ్వగల౦?

కొమ్మల్లో చేరిన
కోకిల కచేరీల కొత్త రాగాల్ని ,
చేట్టుచాటు దాచుకున్న యువజంటల 
నులివెచ్చని స్పర్సల్ని  ఇహ మర్చిపోవడమేనా..?

నది వెళ్తూ వెళ్తూ
ఒడ్డునున్న చెట్టునీడల్ని అలల ఒళ్ళో మూటకట్టుకునేది..
మరిన్ని పూలని పడవ దోసిళ్ళతో తీసుకెళ్ళేది..

చిటారుకొమ్మపై మెరిసే ఆకాశం
వేళ్ళ కింద ఒదిగి  ఉన్న నేల
     పచ్చని సామ్రాజ్యాన్ని ఏలే
     మహారాణిలా ఉండేది చెట్టు .
ఇప్పుడేమో నిప్పులు చెరిగే కళ్ళల్లో
ఫెళ ఫెళలాడే ఎండిన చెట్టులా ఉంది.

కోటి ఆశలతో ఎగిరోచ్చే తుమ్మెదలకి
ఒడిలిన పూలగుత్తులు  ,
వేయి ఊసులతో వచ్చే వసంతానికి 
 ఒట్టిమట్టి  పెళ్లలు ,
 ఏం సమాధానం చెబుతాయి!?

పూల రెమ్మల్ని నిమురుకుంటూ వెళ్ళిన పాట
రాలిన పూల పుప్పొడిలో దాచుకున్న పల్లవుల్ని వెతుక్కుంటో౦ది.

అంతటి పెనుగాలుల్లోనూ
ఎన్ని వృత్తాల్ని గీసింది..!
వరద బీభాత్సాల్ని ఎన్ని ఆకుల్లో దాచుకుంది..!

ఇప్పుడు చెట్టు లేదుకదా!

చెట్టంత మనిషి
గొడ్డలి ఎత్తిన ప్రతిసారీ
చెత్తంతా వొణికి పోవడం చూసి
అల్లుకున్న తీగలు
అల్లాడిపోయేవి..

చెట్టుపడగానే
గడ్డిపువ్వు
ఓ రేకుని రాల్చింది.

చెట్టునుకొట్టి వేళ్ళతో పెళ్ళగించిన చోట 
మట్టికి తగిలిన గాయం 
మరోమొక్కను నాటితేగాని 
మానదనుకుంటా  ..!   

Monday, November 7, 2011

ఆమె

ఆమె రాలేదు
వెన్నెలింత నల్లగా
ఉన్నదేమిటి ?
---------------
ఆమె వస్తుంది
నన్ను స్వీకరిస్తుంది
ఎప్పటికైనా..!
--------------
చెమర్చే కళ్ళు
ఆమె దాచుకుంటోంది
ఓడిపోయాను .
-------------------

Sunday, November 6, 2011

ఆమె

ఆమె నవ్వింది
వికసించే పువ్వుని
చూసినట్లుంది.
-----------------
ఆమె చూసింది 
ప్రవహించే నదిని 
తాకినట్లుంది.
----------------
ఆమె వెళ్ళింది 
పరిమళించే పువ్వు 
రాలినట్లుంది .
------------------