Thursday, December 29, 2011

మా ఊరి హైకూలు 101 .

91 .
పచ్చని పైరు
నిత్యం పారే యేరు
మా ఊరికి౦కేం కావాలి

92 .
తలలూపుతూ
వరిచేలు -రమ్మనో
వెళ్లి పొమ్మనో

93 .
ఊరు తెన్నేరు
అక్షర సంపదని
ఇచ్చిన ఊరు

94 .
గోళీలు గూటీ బిళ్ళలు
ఒంటినిండా దుమ్ము
మా పిల్లలకి అంటుకోలేదు

95
గోడలమీద బోలెడు
 geetalu గీసేవాళ్ళం
పికాసోకు తెలుసు

96
మా పందిరి మంచం
తాతయ్య గుసగుసల్ని
దిండుకింద దాచింది

97 .
తెలుగు మాస్టారు
పద్యానికి అర్ధం చెబుతుంటే
అమ్మ ముద్డ కలుపుతున్నట్లు౦డేది

98 .
బడికెళ్ళేదారిలో
పెద్దపెద్ద చెట్లు
నీడనివ్వడం నేర్పాయి

99 .
నల్లకలువలు
మాచెరువులో మొగ్గతొడిగి
ఆకాశంలో వికసిస్తాయి

100 .
మాఊరి చెరువు
ఉన్నట్టుండి అలల్లో
ఆకాశాన్ని దాచేస్తుంది

101  ఆఖరి రోజు
మాస్టారు తలనిమిరారు
కవిత్వం తలకెక్కింది .

[ హైకూ రాయందే
ఊరూ యేరూ వెన్నెల
ఉండనివ్వవు నన్నిలా ]



Sunday, December 25, 2011

మా ఊరి హైకూలు 90

84 .
ఆడపిల్లలందరూ
హాజరైన రోజు
లెక్కలు తికమక

85 .
మా ఊరిలోపల
మరోఊరు ఉంది
అక్కడంతా ఒక్కటే

86 .
రైలాగినప్పుడల్లా
మా గొడ్డకాడిబుడ్డాళ్ళు
ఇటెక్కి అటుదిగేవాళ్ళు

87 
పలకా బలపం పోయినా 
మా బడి నన్ను ఓదార్చి 
తీర్చిదిద్దింది

88 
నా చిన్నప్పటి చందమామని
పిల్లలకు చూపించాను
మా ఊరు తీసుకొచ్చి

89 
ఊరుకి వెళతానా
ఊరికే ఉండదు
ఊరించి హైకూనిస్తుంది

90 
మా జొన్న చేను
ఆకలిని జయించే
ఆయుధాన్ని విసుర్తోంది



Friday, December 23, 2011

మా ఊరి హైకూలు 83 .


77  చిట్టి గోరింట చేతుల్ని
నా కళ్ళకు ఆన్చేది
ఇప్పుడు ఇక్కడుందో

78
పరికిణి వేసుకున్నాక
పదోతరగతి మానేసింది
తెలుగెంత అందంగారాసేదో

79 
ఎనిమిదో తరగతిలోనే
ఎంకట లక్ష్మికి పెళ్లి
ఏడు కిళ్ళీలు తిన్నాం

80 
వొడుపుగా వరినారుని
రెండువేళ్ళతో నాటేవారు
హైకూ నేర్చుకుంది అక్కడే

81 
నేనొక పాటరాసి
ఊళ్లోకి వెళ్లాను
మాపాలేరు పాడేదిఅదే

82 
చింతతోపుల్లోంచి
చందమామని చూస్తే
మాఊరు కన్పిస్తుంది

83 .
గట్లు తిరగేయడం
నాట్లు వేయడం చూసాక
పాట కట్టడం నేర్చుకున్నా

Thursday, December 22, 2011

మాఊరిహైకూలు 76.

73 . మా జోడేడ్డ్లు
కాడిని మెడకేసుకుంటాయి
బాధ్యత బరువనిపించదు

74 . మాబడి దగ్గర
బావి ఎండిపోయింది
చిన్నప్పుడు ఒంటేలు పోసేవాళ్ళం

75 . వానొచ్చిందని ఇళ్ళకెళ్లమంటే
ఇంద్రధనసు కోసం
పొలాల్లోకి వెళ్ళేవాళ్ళం

76.  పంట బండ్ల కేత్తాక
దిష్టి బొమ్మని పడేసేవాళ్ళం
ఇహ చేలో పిట్టలు వాలేవి


Tuesday, December 20, 2011

మాఊరి హైకూలు 72

67 . ఆ ఇంటిమీది కాకి
ఈ ఇంటిమీద వాలేది
కాకులకు కులాల కుళ్ళు లేదు

68 మాల మాదిగలని
తెలిసేది కాదు
మా ఊరివారని తెలుసు.

69 అదేవెన్నెల
 అవే మనసులు
ఊరేం మారలేదు 

70 వరికోతలకి ఆడవాళ్ళు
కొడవళ్ళతోనూ
కొన్ని పాటలతోనూ

71 . అందరం కట్టుకున్న
ఇసుకగూళ్లు లేవు
ఇప్పుడు ఎవరిళ్లు వారివే

72 మా ఊరు వెళ్తానా
తాటిచెట్ల బారాటి నీడలు
చేతులు చాస్తాయి

Monday, December 19, 2011

మా ఊరి హైకూలు 66

61 . అమావాస్య రాత్రి
కల్లంలో కాపలాకి
మిణుగురులు నాకు తోడు

62 . చేల గట్లమ్మట
ఎగురుకుంటూ మేం
మా చుట్టూ సీతాకోకలు

63   తిరణాల్లో
చింతామణి నాటకం
ఊరునిద్రపోఎదు కాదు

64 . వాడికి కుడికాలు లేదు
నామెడమీద కూర్చొని
బడికితీస్కేల్లెవాడు

65 . రాములవారి గుళ్ళో
గంట అందేది కాదు
అమీరు ఎత్తుకునేవాడు

66 . హిందీ మాస్టారి
హనుమంతుడి వేషం
తోకకి నిప్పుపెట్టేవాళ్ళం

Sunday, December 18, 2011

మా ఊరి హైకూలు 60 .


54    పోద్దుపోగానే
అమ్మమ్మ కధలు చెప్పేది
నిద్రలో 'ఊ ' కొట్టేవాడిని

55 .
బడి వదలగానే
సంధ్య కాంతుల్లో
మెరుస్తూ ఆడపిల్లలు

56 .
కోడిపందాలు
కత్తులు కాళ్ళకే గాని
కడుపులో కాదు

57 .
నిప్పులమీదనడిస్తే
సత్తారుభాయికి
అల్లా కనిపించేవాడు

58 
లాంతరులోనే
రాత్రంతా చదివేవాళ్ళం
వెలుగునీడల లోతు తెలిసింది.

59 .
నిండుపున్నమి నాడు
చందమామని చూస్తే
మా మేనమామ కన్పిస్తాడు

60 .
వోల్లువొంచడమే కాని
తలవంచడం తెలీదు
మట్టి మనుషులు కదా

Saturday, December 17, 2011

మా ఊరి హైకూలు -53

48 . ఎన్ని రైళ్ళోచ్చినా
నీలికళ్ళ అమ్మాయి
దిగనేలేదు

49  రైలుదిగగానే
జ్ఞాపకాల వర్షం
ఊరు ఉప్పొంగేది

50 . పట్టాల మీద
పదిపైసలు పెట్టేవాళ్ళం
రూపాయి కానేలేదు

51 మలుపుతిరిగినప్పుడల్లా
వెళ్ళిపోయే రైలు
వయ్యారాలు చూడాలి

52 పాలపిట్టలు
భుజాలమీద వాలేవి
కువకువలన్నీ హైకూలే

53 . తుమ్మచెట్టు నిండా
ఇంకా ఊగుతున్నాయి
జ్ఞాపకాల గూళ్ళు

Friday, December 16, 2011

మా ఊరి హైకూలు

42 . తుమ్మముల్లు దిగింది
కుమ్మరమ్మాయి
ఉమ్మురాసి తీసింది

43 . తూనీగలం మేం
పోటీపడి ఎగిరేవాళ్ళం
మేమిలా మిగిలిపోయాం

44 . లాంతరు లేనప్పుడు
మా ఇంటిదాకా తోడువచ్చేది
తనెలా వెళ్ళేదో

45 . ఎర్ర వోణీని
కళ్ళకు ఆన్చేది
ప్రపంచమొక మందారం

46 . పలక మీద
నాపేరు రాసేది
చేరిపేసేది

47  పోరుగూరమ్మాయి
వెళ్ళినప్పుడల్లా
వెనక్కితిరిగి చూసేది

Wednesday, December 14, 2011

మా ఊరి హైకూలు

36 . పంటచేల మట్టితో
పరిమళించిన బాల్యం
మా ఊళ్ళో ఇంకా ఉంది

37 . వాన పడగానే
నేనూ వరిచేనూ
 పొంగిపోయే వాళ్ళం 

38   పాగొడ్ల  చావిట్లో
   దమ్ముకోట్టేవాళ్ళం
మామయ్యకెలా తెలిసేదో

39 . మే0 చూస్తుండగానే 
      కలువలు విచ్చుకునేవి 
     ఇహ మమ్మల్నే చూసేవి 

40 .  అప్పుడు తెలీదుకాని
మాపంట పొలాలన్నీ
పచ్చని కవితలే

41 . ఇసుకదిబ్బల్లో
మాపిల్లలు వేళ్ళు పెడితే
నాబాల్యం దొరికింది


మా ఊరి హైకూలు

Tuesday, December 13, 2011

మా ఊరి హైకూలు

30 . మాఊరి తిరణాల్లో
కుక్కపిల్ల పోయింది
నిరుడుపోయి దొరికింది 


31 . చీకటి రాసుకున్న పాట
వెన్నెలై కురుస్తోంది 
మా పల్లె మల్లె పందిళ్ళ మీద 


32 .మా ఊరి మీంచి చంద్రుడు
వెళ్తూనే ఉన్నాడు
నా బాల్యాన్ని  చూస్తూ


33 పెద్ద అమీరు 
పులివేషం వేస్తే చుట్టూ 
పిల్లమేకలం మేమే 


34 గాలిపటాలు గోళీలు
కాగితం పడవలు 
మేం వదిలేసిన ఆస్తులు 


35 పుస్తకాల్లో దాచిన
 నెమలీకలు
చిన్నప్పటి జ్ఞాపికలు











Saturday, December 10, 2011

మా ఊరి హైకూలు

నేను జడలాగిన అమ్మాయిని
మా ఆవిడకి చూపించాను
ఇద్దరూనవ్వుకున్నారు 
----------------------
ఆరో తరగతిలో
నన్ను తిట్టినమ్మాయి
ఇప్పుడు వాళ్లాయన్ని తిడుతోంది
---------------------
చేపలకూర వండింది
వాళ్లాయనకూ నాకూ వడ్డిస్తూ 
నాకో ముక్క ఎక్కువేసింది
------------------
మాఊళ్ళో ఆడపిల్లలు
కాలేజికి రైలెక్కి వెళ్ళేవాళ్ళు
మేం చేలోదిగి చేతులూపేవాళ్ళం
------------------------
 పొన్నాయిపూలచెట్టు కింద
ఆడపిల్లల చెవుల్లో
సన్నాయి ఊదేవాళ్ళం
-------------------------
ఆ బారాటిపిల్ల
ఊరొదిలి వెళ్ళాక
ఒక్క పాటనూ రాయలేదు
----------------------
మా ఊరు వెళ్తే  చాలు
చిన్నప్పటి చిలిపి జ్ఞాపకాలు
అల్లుకొని  వెళ్ళనివ్వవు
-----------------------



Friday, December 9, 2011

మా ఊరి హైకూలు

19 దొంగ జామకాయలు కోసామని
పిర్రలమీద ఈత బెత్తం తేలింది
దాని రుచి మాస్టారికేం తెలుసు.

20 ఓ పాడుబడ్డ ఇంట్లో
దెయ్యాలు౦డేవనేవాళ్ళు
ఊళ్ళో పిల్లలు నాకదే చెప్తున్నారు

21 అమీరుగాడు నాగ్గాడు సాంబడు
అలా పిల్చుకుంటూ తిరిగేవాళ్ళం
భుజాలమీద చేతులేసుకుంటూ

22 మాకోళ్ళ గూళ్ళో
లెక్కకి ఒక్కటి తగ్గేది
నిన్న తిన్న సంగతి గుర్తుండదు
.13    మా పాలేరు ఈలవేస్తే
       పొలానికెళ్ళే దారిలో
       నల్లకళ్ళపిల్ల ఎదురైనట్లే

14 .  మాఊరి మంటపం దగ్గర
      కబుర్లన్నీ ఆగిపోతాయి
      నల్లపిల్లని చూసి

15 . మాగూడెపు పిల్ల
      ఊడుపులకెళ్తే
      పచ్చనిపైరు పొ౦గిపొతది

16 . మా ఊళ్ళో ఏసోబు
      కృష్ణుడి పద్యం ఎత్తుకుంటే
      కులం దిమ్మ తిరుగుతుంది

17 . మా శివాలయంలో
      రాత్రిళ్ళు బికారిబస
      శివుడు లేపితే ఊళ్లోకొస్తాడు

18 . మాపాలేరు నల్లకళ్ళది
      గడ్డివామువెనక్కి చేరేవారు
      వామెందుకూగేదో మరి



Wednesday, December 7, 2011

మా ఊరి హైకూలు






7 .  బడికెళ్ళేదారిలో
తిరిగే కుమ్మరిచక్రం
నన్నెవరో మలుస్తున్నట్లు౦డేది


 8 .    మే౦ బళ్లోకి
      పరిగెత్తికెళ్ళేవాళ్ళం 
      మా బడి నడక నేర్పి౦ది

9 .  బళ్ళో నాటకం వేసాం
    మీసాలూడి పంచె జారింది
    ప్రధమ బహుమతి నాదేలేండి
  
 10  . బడిని ఒదిలేసినప్పుడు
     చెమ్మగిల్లిన కళ్ళని
     తలాకాస్తా పంచుకున్నాం

11 . అఆలు నేర్పిన మాస్టారుకి
     సన్మాన పత్రం రాసాను
    ఒక్క తప్పూలేదని గర్వపడ్డారు   
 
12 . చివరిసారిగా చెక్కకుర్చీని
       మమ్మల్ని చూడాలన్న మాస్టారుకి
       కన్నీటిపొర అడ్డొచ్చింది  

Tuesday, December 6, 2011

మాఊరి హైకూలు

 1
మా  ఊళ్ళో రైలు ఆగి౦ది                                   
 నేను ఒక్కసారి దిగి 
  మళ్ళీ ఎక్కాను                                    


 2 .  రె౦డిళ్ళమధ్య                  
 తాతలనాటి అడ్డుగోడ 
  మధ్యలో తలుపు౦ది ...


౩ . పక్కఊరికీ మాకు
రాకపోకలు పెరిగాయి

బళ్ళదారి ఇరుగ్గాలేదు


4 . మాచేలో తాడిచెట్లు 
    నాచిన్నప్పట్ని౦చీ 
చ౦ద్రుణ్ణి అ౦దుకు౦టూ
 
 5. మా రె౦డూళ్ళ మధ్య
ఓ యేరు పారుతు౦టు౦ది
ఎప్పుడూ వేరుచేసేది కాదు.



 6 .  ఎన్ని దేశాలు తిరిగినా
        మా ఊరొచ్చేసరికి

  కవిత్వ౦ పొ౦గిపొర్లుతు౦ది