Saturday, January 30, 2010

ఆమె ఎవరు?

ఆమె చూసింది
నాకిపుడు కవిత్వం
కొత్తగావుంది .
------------
ఆమె రాకకి
రాగరంజితమైంది
కవి మనసు.
--------------
మౌన భాషిణి
అంతరంగాన ఆమె
రాగ రాగిణి .
------------
ఆమె నవ్వింది
మల్లె మళ్ళీ నవ్వింది
బావుందీ రోజు.
--------------
ఆమె లేదని
అనుకుంటాను కాని
మనసైనది.
--------------
ఆమె నవ్వింది
లోపలి గాయాలన్నీ
మాసి పోయాయి .
---------------

కంట తడి

నా కంట తడి
దిండుకు తెలుసు -నీ
గుండెకేం తెలుసు??
-----------------
బాధగా వుంది
నాకో నది కావాలి
ఏడవ దాన్కి!
---------------

Friday, January 29, 2010

శ్రీ శ్రీ బుల్లెటేన్

శ్రీ శ్రీ భావాలు /సాగు చెయ్యడం /శ్రీ శ్రీ అభిమాని విధి.

శ్రీ శ్రీ భావాలు/ పోగు చెయ్యడం /శ్రీ శ్రీ సాహిత్య నిధి.

'మహా కవి శ్రీ శ్రీ బులేటేన్' సంపుటి-౧ విడుదల అయ్యింది.

సంపాదకుడు; శ్రీ సింగంపల్లి అశోక్ కుమార్.

ప్రగతి తవోర్స్ ..మారుతి నగర్ ..విజయవాడ -౪

Thursday, January 28, 2010

ఒక స్పర్శకి ..!

ఒక స్పర్శకి.....
దేహ పుష్పం విచ్చుకోవచ్చు.!
మొగ్గలా ముడుచుకోవచ్చు..!!

మౌన భాష్యం రాగమయం కావచ్చు.!
విలయానంతర నిస్సబ్దమూ కావచ్చు..!!

అరమోడ్పు కనులు కాంతివంతం కావచ్చు.!
విధ్వంసానంతర బీభత్స దృశ్యం కావచ్చు..!!

లాలనగా జీవన కావ్యం మొదలు కావచ్చు.!
జ్వలించే అగ్ని శిఖలా ప్రజ్వరిల్లవచ్చు ..!!

క్షణంలో
ఒక స్పర్శ ......
రెండు విలక్షనాలుగా
విడి పోవచ్చు ..!!


శ్రీ శ్రీ ..శ్రీర్షిక

శ్రీర్షిక
------
శ్రీ శ్రీ కంటే ముందు .. పద్దెనిమిది పర్వాలు పర్వెట్టాయి
శ్రీ శ్రీ కి వెనుక --ముందు విలక్షణ వాక్యాలు కావ్యాలై ఉద్యమించాయి ..
శ్రీ శ్రీ కి ఇరువైపులా నిలబడ్డారు --పతితులు, భ్రష్టులు
తుడుచుకుంటూ తడి కళ్ళని ..!

శ్రీ శ్రీ కి అన్నివైపులా ఎగరేసారు - కవులూ,కళాకారులూ .. ఎత్తిన పిడికిళ్ళని!

శ్రీ శ్రీ అన్న పేరు
తెలుగు కవితా సంకలనానికి సంచలన శీర్షిక !
శ్రీ శ్రీ కవిత్వమే
తెలుగు సాహితీ జగత్తుకి గొప్ప జ్ఞాపిక !!

Saturday, January 23, 2010

ఆమె నం.2

ఆమెను తలచిన మరు క్షణమే - నా లోపలి దీపాన్ని వెలిగించి
మనసు మూలల్ని కాంతివంతం చేస్తుంది .
ఆమె అధర స్పర్శ..నాలోని ..లోలోని మౌన రేణువుల్ని
మెత్తగా కరగిస్తుంది .
అనుకోని ఆమె చూపుల దీపశిఖ
నన్ను మరింతగా వెలుగు పరుస్తుంది.
దూరపు అపరిచిత నీలి నీడల్ని దగ్గరతనం చేస్తుంది.
ఇంకా ఇంకా చాలా చాలా దగ్గరగా జరిగి కరిగి
ఇంక చాలని
అక్షరాలని దోసిట్ల పోసి ...దాచుకోమంటుంది.

ఆమె నం.1

ఆమె
నా మనసుని అలికి ముగ్గేస్తుంది .
చిరుకోపంలో అలిగి దూరమైనట్లుగా దగ్గరౌతుంది.
చీకట్లని చెదరకొట్టి నిలువెల్లా వెన్నెలౌతుంది.
ఎదను నిమిరి మెల్లగా కవిత్వమౌతుంది .
తెల్లారేసరికి నా కవితకి లాలనగా కొత్త శీర్షిక నిచ్చి
చిలిపి జ్ఞాపకాల్లోంచి నెమ్మదిగా ఇంటిపనుల్లోకి జారిపోతుంది .
పగలంతా పమిట కొంగులా చుట్టేసుకుంటుంది.
ఆమె నేనుగా -నేను ఆమెగా తనలో తను నవ్వేసుకుంటుంది.

Friday, January 22, 2010

పిచ్చుకలు

//

  1. నన్నే చూస్తోంది/ తల్లిలేని పిచ్చుక /దోసిలయ్యాను.
  2. పిచ్చుక గూడు /తుమ్మ చెట్టుకుతోడు/ ఇప్పుడులేదు .
  3. పిచ్చుకవస్తే /ఓ ఇల్లు కడతాను/ ఎప్పటికైనా .
  4. ఒకటే వాన /తడుస్తూ గూళ్ళు -అన్నీ కిచకిచలె.
  5. కొమ్మలనిండా /పిచ్చుకలు వాలాయి /ఊగింది చెట్టు .
  6. వడ్ల గింజని/ గొంతులోకి లాగింది /తీరిందాకలి .
  7. కుడిరెక్కతో/ ముక్కుని గీరుతోంది /చిరాకేందుకో ?
  8. రెండో పిచ్చుక / వచ్చి వాలింది -గూడు ఊగుతూ ఉంది.

బుల్లి పిచ్చుకలు

  1. బుల్లి పిచ్చుక/చిన్న పుల్లను తెచ్చి / తల్లికిచ్చింది .
  2. బుల్లి పిచ్చుక /దోసిట్లో నీళ్ళు తాగి /రెక్కలూపింది .
  3. బుల్లి పిచ్చుక/ధ్యాన ముద్రలో స్వామి /రెట్ట వేసింది.
  4. బుల్లి పిచ్చుక /ముందొక పెద్ద గద్ద/ అ యి తే ఏంటి ?

Tuesday, January 19, 2010

రాత్రి

ఉదయం పరుషంగా ఉంటుంది
కాఫీ కప్పు కర్కశంగా అరచేతులో మోగుతుంది
మనసుని ఓ మూలకు ఊడ్చేస్తూ
ప్రేమను ఓ పక్కన పెట్టమంటుంది
ఆమె - ప్రతిఉదయమ్ ఇంకోలా ఉంటుంది
రాత్రికి మాత్రం - పూలుపెట్టుకున్న యంత్రంలా ఉంటుంది. .
యంత్రం వేడికి కొన్ని పూలు మనసు లేని చోట పడి మాడిపోతాయి..
చూస్తూన్నకొద్దీ
ఎందుకు చూడాలనిపించదో అర్ధం కాక
సంసారం చట్టుబండలై కొన్ని కెరటాలని తట్టుకుంటూ అలా ఉండిపోతుంది
రేపటి ఉదయం ఇంకెలా ఉంటుందోనని భయంగా తెల్లారుతుంది
మసకబారిన వెన్నెల
వాసన లేని మల్లెల సాక్షిగా
క్రితం రాత్రి యంత్రం బాగానే పనిచేసింది
రేపటి ఉదయం ఇంకోలా ఉంటుందా?

Sunday, January 17, 2010

ఆమె వస్తే..

ఆమె వస్తే చాలు ...
రాసి పారేసుకున్న పాటలన్నీ ప్రాణం పోసుకుంటాయి
పల్లవులన్ని పొంగి పొరలుతాయి.
ఆమె వెళ్తే చాలు ...
లోపలి అక్షరాలు అల్లాడిపోతాయి
గుండెలోని పాటలు గొంతు దాటనంటాయి .
ఆమె వచ్చి వెళ్ళే లోపు
కాలం- క్షణకాలం ఆగి
అందని భావాలని మనసంతా నింపి వెళ్తుంది.

తుమ్మెద

తుమ్మెద వస్తే చాలు ....
మొగ్గలన్నీ రేకులు విప్పుకుంటాయి
దోసిళ్ళ కొద్దీ మకరందాన్ని సమర్పించుకుంటాయి .
తుమ్మెద వెళ్తే చాలు...
పువ్వులన్నీ చిన్నబోతాయి
కంటతడిని దాచుకుంటూ కొత్త స్పర్శని తలచుకుంటాయి ....
తుమ్మెద-పువ్వుల
క్షణకాల అనుబంధాన్కి పులకరించి
కొమ్మలన్నీ మొగ్గలు తోడుగుతాయి.

........... ------- ..........

Tuesday, January 12, 2010

పొదరిళ్ళు

కొడుకు ఒక నైక్ షూ----నాన్న ఒక తెగిన చెప్పు
కూతురొక చేమ్కి చుడిదార్ --అమ్మ మసిపాత గుడ్డ
అమ్మా నాన్న - రగిలే రెండు కుంపట్లు
పిల్లలేమో పొంగే కలల పొదరిళ్ళు.

Monday, January 11, 2010

పరిమళం

కళ్ళు మూస్తే చాలు ..
చల్లని చీకటి ..మెరుస్తూ చందమామ
జాలువారే పున్నమి వెన్నెల
తళుకులీనుతూ కోటి నక్షత్రాలు...!

కళ్ళు తెరిస్తే చాలు...
వెచ్చని వేకువ ..పక్షుల కువ కువలు
జ్వలిస్తూ కాంతి కిరణాలు
పులకరిస్తూ పచ్చని నేల...!

రెప్పపాటుకాలంలో
జీవనకావ్యప్రవాహం
పరిమళభరిత మౌతున్నవైనం...!!

ఓ బ్లాగులమ్మ

అ. ఇంటరునెట్టు / ఇంట ఓ మూలనెట్టు / కాలంగాడవకపోతే ఒట్టు.../ ఓ బ్లాగులమ్మ.
ఆ. ఇంటరునెట్టు/లోకాలను చుట్టు/ విజ్ఞానానికి మరో మెట్టు..../ ఓ బ్లాగులమ్మ.
ఇ. ఇంటరునెట్టు /అచ్లీలాలు చూపెట్టు/చట్టం చెప్పుతోకొట్టు.../ఓ బ్లాగులమ్మ.

Saturday, January 9, 2010

కత్తులు దాచుకున్న కళ్ళు ఆకాశంలోకి చూపుల్ని విసిరేశాయి. గాయపడ్డ రెండు మెరుపుతీగలు బాధగా మెలికలు తిరుగుతూ తడిసిన మబ్బులచెంపలమీద నించి జారి గుండెల్ని బాదుకుంటూ సాయంత్రంలో గుచ్చుకున్నఇన్ద్రధనసునుఎక్కి ఎటోవేల్లిపోయాయి . నింగీ నీల రెండూ వేరు వేరని చందమామ చుక్కలతో చెప్పిన రహస్యం నేల మీద తుళ్ళిపడే సెలయేళ్ళు విని తీరాన అలలపై తల బాదుకొని సోమ్మసిల్లాయి. ఎర్రని ఎండ , దోసిళ్ళతో నీళ్ళని తోడి పైకి విసిరేసింది. అక్కడో ఆకాశం నీలంగా మెరిసింది. రహస్యం బట్ట బయలు అయిందని చందమామ చుక్కలచాటుకి వెళ్ళేపోయింది.

Thursday, January 7, 2010

వెన్నెలలాంటి ఆమెభుజాలమీంచి నల్లనిత్రాచు మేల్లగాపాకి పొంగుతున్న వక్ష్జోజాల మీద ఊగిసలాడే పూలదండని వాసనచూసి సన్ననడుమ్ని మెల్లగా చుట్టుకొని నాభిలోకిజారిపోగానే , తెల్లని పూమోగ్గ బిగుసుకున్నరేకుల్ని సౌమ్యంగావిప్పుకుంటూ కెవ్వునపెట్టిన కేకకి గుడి శిఖరం మీద అటునిటు తిరిగే పావురాయి కువకువలాడుతూ వేకువని ముక్కునకరచకొని ఆకాశాన్ని పొడుచుకుంటూ పడమరదిక్కుకి సూటిగా రెక్కల్ని సారించి నిన్నటి జ్ఞాపకాలని విసిరేసింది.

ఓ బ్లాగులమ్మ.


ఇంటరునెట్టు/ఇంట మూలనెట్టు / కాలంగాడవకపోతే ఒట్టు/ ఓబ్లాగులమ్మ.


ఇంటరునెట్టు/లోకాలను చుట్టు/విజ్ఞానానికి మరోమెట్టు/ బ్లాగులమ్మ.


ఇంటరునెట్టు / ఆశ్లీలాలు చూపెట్టు/ చట్టం చెప్పెటికొట్టు/ బ్లాగులమ్మ.

Wednesday, January 6, 2010

థాంక్స్.

శ్రీకాంత్, సతీష్ గార్లకి మనఃపూర్వక కృతజ్ఞతలు.

కల

ఈ అక్షర మహాత్సవం శ్రీకాంత్,సతిశగార్ల సాయంతో ఈ క్షణాన మొదలవ్వడం సంతోషంగా ఉంది.