Wednesday, March 31, 2010

అలల్లో..

మనసు నది
ఎటో ప్రవహిస్తోంది
అలల్లో ఆమె.
---------------
పూలరంగుల్ని
సీతాకోక చిలుక
మోసుకెల్తోంది .
------------
కత్తిని చూసి
మేకపిల్ల, చెవుల్ని
అల్లాడించింది .
-------------

Friday, March 26, 2010

కొత్త ముగ్గు ..

చాలా రాత్రయ్యాక చూస్తే
చంద్రుడు చుక్కలెడుతున్నాడు
కొత్త ముగ్గు కోసం..
---------------
నల్లమబ్బు వాల్జడ
జాబిల్లి మల్లి
రాత్రికి వెన్నెల ..పూల్జడ
----------------
ఓ రాత్రి ..ఓ పగలు
రాత్రి వెన్నెల ధగధగలు
వెన్నెలకి పగలంటేపగ.
-----------------

Wednesday, March 24, 2010

పూలు

పచ్చని చెట్టు
కొమ్మలన్నీ పూలతో
కావ్య సంపుటి.
-------------
పూలు రాలాయి
ఉన్న కొన్ని క్షణాలు
పరిమళించి.
------------
పొన్నాయి పూలు
కవినేదో అన్నాయి
పొంగి పోయాడు.
----------------

Monday, March 22, 2010

మ్రోగింది వీణ ..

మ్రోగింది వీణ
కొనగోటికి రాగం
ఋణపడిందా ..!?
-----------
ప్రపంచమొక
కవితా సంకలనం
చదవాల్సిందే .
-------------
రెప్పల తడి
చుట్టూరా అక్షరాలు
కవినైనాను .
--------------

Saturday, March 20, 2010

సిరా ఒలికి..

సిరా ఒలికి
అక్షరాలూ తడిసాయి
రాసుకున్న కవితల్ని
కలం మర్చి పోయింది.
కానీ..కాలం నేమరువేస్తోంది.
---------------------
మౌనంగా ..
తెలియనివెన్నో
తెలిసీ తెలియని తలపుల వెనుక
తెరిసీ తెరియని తలుపుల వెనుక
మృదువుగా చప్పుడు చేస్తున్నాయని
మౌనంగా ఉంటేనేగాని ....తెలియలేదు.
రెప్పల వెనుక
మహానదులున్నాయని
ఒక్క కన్నీటి చుక్క
జారేంతవరకు తెలియలేదు.
కలం కదలికల వెనుక
కోటి అక్షరాలూరగుల్తున్నాయని
కవిత పొంగే వరకు తెలియలేదు.
పదునెక్కిన ప్రేమ
కత్తిలా గుచ్చుకుంటుందని
ఆమె చూపులు కలిసెంత వరకు తెలియలేదు.
ఊహల ఊయల వెనుక
కదంతొక్కే లక్షలాది అక్షరాలూ
ఎగసి పడతాయని
దీర్ఘ కవితకి చిరు శీర్షిక
అలవోకగా
జాలువారెంత వరకు తెలియలేదు.

Friday, March 19, 2010

వరల్డ్ హౌస్ స్పారో డే..!

నిన్న వెళ్ళిన
పిచ్చుక రానేలేదు
గూడు గుబులు..!
---------------
మా పొలానికి
పిచ్చుకల కాపలా ..
ఎప్పటి ఋణం..?
-------------
పిచ్చుకలన్నీ
నిన్నటి జ్ఞాపకాల్లో
ఎగురుతున్నై..!
--------------

Wednesday, March 17, 2010

లోపలి మొక్క ..

నా లోపల
ఒక మొక్కను నాటాను.
అది చెట్టయింది .
కొన్ని ఊహలు పూచాయి
అవి సీతాకోక చిలుకలతో కలసి
ఎగిరి పోయాయి హాయిగా..
కొన్ని పూవులు పూచాయి
పరిమళాల్ని లోకానికిచ్చి
కొత్త రంగుల్ని కోరుకుంటున్నాయి .
కొన్ని పక్షులు వాలాయి
అవి నిరంతరం గుసగుస లాడుతూ
కొత్త సంగతులు చెప్పుకుంటున్నాయి .
కొంతమంది కవులు నీడన చేరారు
కవిత్వమంటూ ఏమీ చెప్పలేదు కానీ...
కన్నీటి భాషలో మనసుని రాసుకుంటున్నారు
కొందరు మాత్రం మెరిసే కళ్ళతో
ఇంద్ర ధనస్సును చెట్టుకు కట్టే ప్రయత్నంలో ఉన్నారు,
ఆడుకునే పిల్లలకిద్దామని ..
నాలోపల
చాలా మొక్కల్ని నాటాను
ఎప్పుడు చూసినా ఏవో జ్ఞాపకాలు
అక్షరాలుగా అల్లుకోవడం చూస్తున్నాను.
అసలు ..నేను మొక్కలోపల ఉన్నానా!?

నీ జ్ఞాపకాలే నా ప్రాణం....వాటితోనే నా ప్రయాణం: నువ్వున్నావు...నీ జ్ఞాపకాలున్నాయి

నీ జ్ఞాపకాలే నా ప్రాణం....వాటితోనే నా ప్రయాణం: నువ్వున్నావు...నీ జ్ఞాపకాలున్నాయి

రాలిన అకు

రాలిన ఆకు
పచ్చని జ్ఞాపకాల్ని
కొమ్మకిచ్చింది.
--------------
ఆకు రాలింది
రాసుకున్నపాటల్ని
కొమ్మలకిచ్చి.
--------------
రాలిన ఆకు
ఏమీ చెప్పనే లేదు
రెమ్మలకైనా.
--------------

Sunday, March 14, 2010

వెన్నెల రాత్రి..

వెన్నెల రాత్రి
వేణువుని ఊదాను
ఆమె రాలేదు.
-----------
వెన్నెల రాత్రి
పాటరాని క్షణాన్ని
విసిరేసాను.
------------
రాత్రి, వెన్నెల,
పిల్లనగ్రోవి పాట..
కలవలేదు.!
-----------

Saturday, March 13, 2010

కొమ్మ-కోకిల

ఎగిరిపోతూ
కోకిలోకపాటని
కొమ్మకిచ్చింది.
------------

-------------
ఎందుకోగాని
కొమ్మలన్నీవాడాయి ..
ఏదీ కోకిల?
--------------
కోకిలవస్తే
కొమ్మలు పాడతాయి
పూతమరచి.
-----------

Friday, March 12, 2010

కొమ్మలు కొన్ని

కొమ్మను వంచి
కొన్ని పువ్వుల్నికోసా
రేపురాకంది.
---------------
కొన్ని పువ్వులు
కోకిల పాటవిని
రాలనన్నాయి .
-------------
కొన్నిపువ్వులు
కొమ్మలచాటున్నాయి
గాలి రాల్చింది.

యంత్రం..

తెల్లారగానే
ఆమె రోబో అవుతుంది.
ఇంటిపనులు అన్నింటినీ పూర్తీ చేస్కొని
సర్వీసు ఆటోల్లో మృగాళ్ళ మధ్య
ఆర్టీసి బస్సుల్లో వత్తిళ్ళ మధ్య
ఎలాగోలా ఆఫీసుకు టైముకు చేరి
టికు టికు మంటూ టైపు మషీను అవుతుంది,
తలకూడా ఎత్తకుండా కంప్యుటరు అవుతుంది.
సాయంత్రం వస్తూ వస్తూ కూరలసంచి గా మారి
నీరసంగా ఇంటికి చేరి గుక్కెడు నీళ్ళు తాగుతుంది.
అలసటను దాచిపెట్టి చురుకుదనం తెచ్చుకొని
బయటనుండి వచ్చిన భర్తకి వేడివేడి కాఫీ ఇస్తుంది.
చంటి గాడి హోం వర్క్ అంతా చూసి, వీలుంటే తనే మొత్తం చేసేసి,
చిన్న దాన్కి మాత్రం అంట్లు పడేస్తుంది.
ఆడపిల్ల లు పని చేస్కో పొతే ఎలా? అని
పాత పాఠాలు నూరిపోస్తుంది.
రాత్రిళ్ళు ఎలాగో కలత నిద్ర పోతుంది.
కలల గూళ్ళు చెల్లా చెదురు అవుతున్నా
మౌనంగా చీకటి రాత్రుల్ని భరిస్తుంది.
----
తెల్లారగానే
మళ్ళీ యంత్రం మెల్లగా, మౌనంగా
పని చేయడం మొదలౌతుంది.
గ్యాస్ ధర పెరిగినా, కరెంటు లేకపోయినా
ఈ యంత్రం పని చేయాల్సిందే ..!
పగలు-రాత్రి ఆడటమే కాని
ఆగటం తెలీదు.
కష్టాలను చెరిపేసుకొని ,కన్నీళ్ళని తుడిచేసుకొని
అందరికీ కనిపించే ఈ యంత్రం పేరు 'మహిళా'
అమ్మ అని , భార్య అని లేబుల్స్ తో వస్తుంది.
ప్రేమకు మారు పేరు --క్షమకు మరో పేరు
అని అప్పుడప్పుడు కాస్త పొగిడితే చాలు ..
ఈ యంతం ఎన్ని ఏళ్ళు అయినా పని చేస్తుంది భలేగా.
అదే అసలు మంత్రం..
ఎన్ని బడ్జెట్లు వచ్చినా దీని ధర పెరగదు-తరగదు.
ఏమైనా రాయండి-ఎన్నైనా చెప్పండి-
ఆమె లేకపోతె మన బ్రతుకు -వరదలో మునిగిన పంట పొలం
కళ్ళెదుట ఉండే దేవతా శిల్పం.
కుటుంబ బంధంలో ఆత్మీయత వెదజల్లే సాస్వత సౌగంధ సౌరభం.
కూరల సంచినే కాదు..
కారల్ మార్క్స్ కి జన్మ నిస్తుంది..లెనిన్ కి ఆలోచన యిస్తుంది.
రవీంద్రునికి గీతాంజలి నిస్తుంది.
ఒక బాలమురలికిసుస్వరాన్ని యిస్తుంది.
వేమన చేతిలో పద్యమై మెరుస్తుంది.
శ్రీ శ్రీ కి అక్షరం నూరి పోస్తుంది.
------ఎన్ని దుర్మార్గాలు చేసినా
దీపస్తంభంలా వెలుగులు పంచుతుంది.
ఆమెను ఆదరిస్తే చాలు ..మనిషిగా చూసినా చాలు .
ప్రతి రోజు మనకి ఉత్సవ వాతావరణం కల్పిస్తుంది.

Thursday, March 11, 2010

బలపం..

బడి..హైకులు

బలపమిచ్చా
రెండు జెళ్ళ సీతకి
నే గుర్తుంటానా..?
------------
బడి గంటని
ముందే కొట్టినందుకు
చేతిలో టీ .సి.
---------
స్కూలుకు వెళ్తే
జైలుకు వెళ్ళినట్లే ..
ఆడనివ్వరు..!
-------------

బొమ్మ

తనే బొమ్మ
మరో బొమ్మనిమ్మని
ఏడుస్తూ పాప .
--------------
చిట్టి పిడత
పాప వండి పెడితే
లొట్ట లేసాను.
--------------
బొమ్మల పెళ్లి
ఊరంతా సందడంట..!
మీరు రాలేదు.

Wednesday, March 10, 2010

తీపి గుర్తులు..

వొరిగిన చెట్లు
చెదిరిన దృశ్యం
సుడిగాలి ఆనవాళ్ళు ..!
జారిన తీగ
రాలిన పూలు
చిరుగాలి తీపిగుర్తులు ..!!

Tuesday, March 9, 2010

నువ్వు లేనట్టే ......

తడికళ్ళతో
ఆమె నిలబడితే
నువ్వులేనట్టే ..!
------------
ఆమె కళ్ళల్లో
సన్న కన్నీటిపొర
నువున్నా..లేవు.
-------------
తడి కళ్ళని
ఆమె దాచుకుంటోంది
లేనట్టే ..నువ్వు.

Sunday, March 7, 2010

అనువాద హైకు..

కాకి ఎగిరి
మోడుమీద వాలింది
తోడు వచ్చిందా..?
నత్సుమే ..జపనీ ..
----------------
చీమను చంపాను
పిల్లలు చూసేసారు
సిగ్గుపడ్డాను .
కతో ..జపనీ ..
-------------
కోకిలపాట
కుహు..కోహూ అన్నాయి
రెండు కొండలు.
శిరో..జపనీ..
------------

అనువాద హైకు..

Friday, March 5, 2010

మట్టి కాళ్ళు..

తొలివేకువ
చీకట్ని చీల్చుకుంటూ
మొలకెత్తింది.
-----------
మట్టికాళ్ళకు
పులకరిస్తూ నేల
పంటనిచ్చింది.
------------
చేలోకి వెళ్తే
పలకరిస్తూ కొన్ని
కల్లుముంతలు.
----------

ఆమె..ఆమని..

ఆమెను చూసి
కొమ్మల్లో కోకిలమ్మ
"కుహూ" అన్నది.
*************
ఆమె వచ్చాక
రాలిన పూవులన్నీ
కదుల్తున్నాయి .
*************
ఆమె వెళ్ళాక
ఆమని వచ్చినట్లు
గుర్తులున్నాయి.
*************

Wednesday, March 3, 2010

...అంటే!

కవిత్వమంటే
కంటతడిని తుడిచే
వేళ్ళ కోసం
వెతుకులాట..!

వెళ్ళ నివ్వవూ ..

చిట్టి చేమంతి
నాకో మాట చెప్పింది
నేను చెప్పను.
-------------
రాత్రి మల్లెలు
ఎన్నెన్ని కబుర్లని..
చెప్పనివ్వవు.
-------------
విరజాజులు
విచ్చుకున్నాక చూడు ...
వెళ్ళ నివ్వవు .
---------------


Tuesday, March 2, 2010

అరుస్తూ పక్షులు..

అరుస్తూ పక్షులు ..
పొద్దు పొడిస్తే ...కూటి కోసం !
పొద్దు గడిస్తే ....గూటి కోసం !!