Wednesday, March 31, 2010

అలల్లో..

మనసు నది
ఎటో ప్రవహిస్తోంది
అలల్లో ఆమె.
---------------
పూలరంగుల్ని
సీతాకోక చిలుక
మోసుకెల్తోంది .
------------
కత్తిని చూసి
మేకపిల్ల, చెవుల్ని
అల్లాడించింది .
-------------

Friday, March 26, 2010

కొత్త ముగ్గు ..

చాలా రాత్రయ్యాక చూస్తే
చంద్రుడు చుక్కలెడుతున్నాడు
కొత్త ముగ్గు కోసం..
---------------
నల్లమబ్బు వాల్జడ
జాబిల్లి మల్లి
రాత్రికి వెన్నెల ..పూల్జడ
----------------
ఓ రాత్రి ..ఓ పగలు
రాత్రి వెన్నెల ధగధగలు
వెన్నెలకి పగలంటేపగ.
-----------------

Wednesday, March 24, 2010

పూలు

పచ్చని చెట్టు
కొమ్మలన్నీ పూలతో
కావ్య సంపుటి.
-------------
పూలు రాలాయి
ఉన్న కొన్ని క్షణాలు
పరిమళించి.
------------
పొన్నాయి పూలు
కవినేదో అన్నాయి
పొంగి పోయాడు.
----------------

Monday, March 22, 2010

మ్రోగింది వీణ ..

మ్రోగింది వీణ
కొనగోటికి రాగం
ఋణపడిందా ..!?
-----------
ప్రపంచమొక
కవితా సంకలనం
చదవాల్సిందే .
-------------
రెప్పల తడి
చుట్టూరా అక్షరాలు
కవినైనాను .
--------------

Saturday, March 20, 2010

సిరా ఒలికి..

సిరా ఒలికి
అక్షరాలూ తడిసాయి
రాసుకున్న కవితల్ని
కలం మర్చి పోయింది.
కానీ..కాలం నేమరువేస్తోంది.
---------------------
మౌనంగా ..
తెలియనివెన్నో
తెలిసీ తెలియని తలపుల వెనుక
తెరిసీ తెరియని తలుపుల వెనుక
మృదువుగా చప్పుడు చేస్తున్నాయని
మౌనంగా ఉంటేనేగాని ....తెలియలేదు.
రెప్పల వెనుక
మహానదులున్నాయని
ఒక్క కన్నీటి చుక్క
జారేంతవరకు తెలియలేదు.
కలం కదలికల వెనుక
కోటి అక్షరాలూరగుల్తున్నాయని
కవిత పొంగే వరకు తెలియలేదు.
పదునెక్కిన ప్రేమ
కత్తిలా గుచ్చుకుంటుందని
ఆమె చూపులు కలిసెంత వరకు తెలియలేదు.
ఊహల ఊయల వెనుక
కదంతొక్కే లక్షలాది అక్షరాలూ
ఎగసి పడతాయని
దీర్ఘ కవితకి చిరు శీర్షిక
అలవోకగా
జాలువారెంత వరకు తెలియలేదు.

Friday, March 19, 2010

వరల్డ్ హౌస్ స్పారో డే..!

నిన్న వెళ్ళిన
పిచ్చుక రానేలేదు
గూడు గుబులు..!
---------------
మా పొలానికి
పిచ్చుకల కాపలా ..
ఎప్పటి ఋణం..?
-------------
పిచ్చుకలన్నీ
నిన్నటి జ్ఞాపకాల్లో
ఎగురుతున్నై..!
--------------

Wednesday, March 17, 2010

లోపలి మొక్క ..

నా లోపల
ఒక మొక్కను నాటాను.
అది చెట్టయింది .
కొన్ని ఊహలు పూచాయి
అవి సీతాకోక చిలుకలతో కలసి
ఎగిరి పోయాయి హాయిగా..
కొన్ని పూవులు పూచాయి
పరిమళాల్ని లోకానికిచ్చి
కొత్త రంగుల్ని కోరుకుంటున్నాయి .
కొన్ని పక్షులు వాలాయి
అవి నిరంతరం గుసగుస లాడుతూ
కొత్త సంగతులు చెప్పుకుంటున్నాయి .
కొంతమంది కవులు నీడన చేరారు
కవిత్వమంటూ ఏమీ చెప్పలేదు కానీ...
కన్నీటి భాషలో మనసుని రాసుకుంటున్నారు
కొందరు మాత్రం మెరిసే కళ్ళతో
ఇంద్ర ధనస్సును చెట్టుకు కట్టే ప్రయత్నంలో ఉన్నారు,
ఆడుకునే పిల్లలకిద్దామని ..
నాలోపల
చాలా మొక్కల్ని నాటాను
ఎప్పుడు చూసినా ఏవో జ్ఞాపకాలు
అక్షరాలుగా అల్లుకోవడం చూస్తున్నాను.
అసలు ..నేను మొక్కలోపల ఉన్నానా!?