Monday, August 23, 2010

జన్మనిచ్చేది ...

జన్మ నిచ్చేది
అమ్మ ఒక్కటే కాదు..
అక్షర౦ కూడా..!
ఈ రోజు నా జన్మ దినం.
యాభై వస౦తాలు నిండిన క్షణం ..
ముందుకు పొతే ముసలి తనం..
వెనక్కి వెళితే పసిడితనం..
ఇలా ఉండిపొతే ఎంత బావుంటుందీ క్షణం..!

Tuesday, August 3, 2010

ఓ పువ్వు రాలుతు౦ది ....

నన్ను ఈ దారినే వెళ్ళనివ్వండి ..
ఇరువైపులా ఎదిగిన చెట్లు
నన్ను గుర్తుపట్టి
ఇంత నీడనీ -కొన్నిపూలనీ ఇచ్చాయి కదా ..!
---నాదోసిళ్ళ లోంచి
కాసిని నీళ్ళు పోసిన జ్ఞాపకం
నీడలా పరచుకుంది కదా ..!
కంచెవేసి కాపలా కాసానని
పూల పరిమాళాలని పంచింది కదా..!!
----నన్ను మోసు కెళ్ళేపుడు
ఈ దారినే వెళ్ళండి ..
ఒక్క క్షణమైనా
ఓ చెట్టు నీడలో ఆపండి.
తప్పకుండా ఓ పువ్వు రాలుతుంది నాపైన.

Sunday, July 4, 2010

వెన్నెలకి తెలుసా?

ఆ రాత్రి
ఏ౦జరిగిన్దొ
జాబిలికి తెలియదు ..కానీ
వెన్నెలకి తెలుసు !
కాటుక కళ్ళని చూసిన
మెరుపుతీగకు తెలుసు !
మల్లెపూలని అడిగితె
జాబిలికే తెలుసు అంటాయి .
ఎరుపెక్కి
బరువెక్కిన ఆమె కళ్ళు మాత్రం
ఎవరికీ ..ఏమీ తెలీదు అంటాయి .

Tuesday, June 29, 2010

కొంత రాత్రయ్యాక ..

కొంత రాత్రయ్యాక చూస్తే
చంద్రుడూ లేడూ..చుక్కలూ లేవు.
చెట్లనిండా ఆవరించిన చీకటి
నేలమీద జారుతోంది.
రేకులనిండా దాచుకున్న వెన్నెలని
ఎవరికైనా ఇవ్వడానికి l
ఓ మల్లెమొగ్గ తహతహలాడుతోంది .
కొంత సేపయ్యాక చూస్తే
రెప్పల చప్పుళ్ళకి ఉలిక్కిపడెంత నిశ్శబ్దం .
అంత నిశ్శబ్దం లోనూ
రాత్రి తెగ తాపత్రయ పడుతోంది..
రేపటి ఉదయాన్ని
రాగరంజితం చేయడానికి.

Sunday, June 20, 2010

ఆ క్షణం

ఉన్నపాటి కొద్ది స్తలంలో
ఓ పూరిపాక ఉండేది.
ఓ దీపం ఉండేది.
నా ముద్ద నేను తినేవాడిని.
కాల గమనం లో అక్కడో భవంతి కట్టాను.
గర్వంగా తలెత్తుకొని వెళ్తే
గుమ్మం తగిలి తలకి బొప్పికట్టింది.
ఎంతకూ తగ్గని నొప్పిని భరించలేక
స్కానింగ్ తీస్తే,
తలలో రక్తం గడ్డ కట్టిందన్నారు.
ఆలోచనలేమీ పెట్టుకోవద్దన్నారు.
.....కానీ
పూరిగుడిసె గుర్తుకొచ్చింది.
దాన్లోని దీపం గుర్తుకొచ్చింది.
నా ముద్ద గుర్తుకొచ్చింది.
తలను వొంచి
నా మానాన నేను బతికిన ఆ క్షణం గుర్తుకొచ్చింది.
'ఈ ఒక్క లక్షణం చాలు
ఎవరైనా మళ్ళీ బతకడానికి' అంటున్నారు .

నది ..అలల సవ్వడి

నది ఆవలి గట్టున ఇల్లు .
అక్కడో దీపం దిగులుగా వెలుగుతోంది .
ఓ అనివార్యపు ఒంటరి సాయంత్రంలో
ఇవతల నేను .
.....నీళ్ళు లేని నది
..... కదలని పడవ
..... గాఢమైన నిరీక్షణ
నదిలోకి నీళ్ళు చేరాలి
అలల అరచేతుల్లో పడవ తేలాలి
ఆవలి ఒడ్డుకు చేరాలి...
అప్పుడు కదా
వాకిట్లో నిలబడి
అలల సవ్వడి వింటూ
నది నుదుటిపై
సూర్య కాంతిని చూడాలి!??
..... ఓ
చినుకు పడింది.
ఇప్పుడు మీకు
నది వస్తున్న చప్పుడు వినబడుతోందా??

Wednesday, June 16, 2010

లేకపోతె..

ఎక్కడినించో
నీళ్ళల్లో కొట్టుకొచ్చిన చీమకి,
ఒడ్డునున్న గడ్డిపోచ
చేయిన౦ది౦చాక..........
-----ఈదురుగాలుల్ని తట్టుకొని
బెదురు చూపుల్తో
ముళ్ళ క౦చలొ చిక్కడిన పిచ్చుక పిల్లకి
పక్కనే పచ్చని గుబురు కనిపించాక .......
------చెలరేగుతున్న ఒ౦టరితనపు మ౦టలతో
విసిగి వేసారినప్పుడు చల్లటి సహచర్యపు
సెలయేటి అలల గలగలలు వినిపించాక.......
ఎవరికీ ఎవరైనా
లేకపోతె నేమి..?
ఒకరికి ఇంకొకరు తోడైనపుడు ...!