Thursday, November 4, 2010

బారాటి నీడ...!

వస్తాడన్న సమయానికి
రాలేదన్న సందర్భానికి -మధ్య
తీరని తాపత్రయ అగాధముంది.
వస్తాడన్న ఆశకి
రాలేడన్న వార్తకి -మధ్య
కనిపించని గాయాల బాధ ఉంది
నిన్నటివరకు బాగానే ఉన్నాడు
మళ్ళీ వస్తాననే వెళ్ళాడు
చాలా బారాటి నీడని కన్నీటి వెనుక వొదిలి
ఇప్పుడేమో ఓ జ్ఞాపకం లో ఉండిపోయాడు .

గత నెల తొమ్మిదిన నా మిత్రుడు జాస్తి శ్రీ కృష్ణ వరప్రసాద్ -జాకీ
అమ్మని కూడా వదలి వెళ్లిపోయాడని ,
చాలా 'దూరం ' వెళ్లిపోయాడని తెలిసి
ఇలా అక్షరాలలో వెతుక్కుంటూ ..

Thursday, October 7, 2010

ఖాసీం భాయ్ ..ఓ పావురం..ఓ దీపం

మా పాపకి గాలి సోకితే
మా ఖాసీం భాయ్ తావీదు కడతాడు ..!
ఖాసీం భాయ్ ఇంట్లో కష్టం వస్తే
మరు క్షణం లో నేను నడుం కడతాను...!!
----------------------------
ఓ పావురాయి
మందిరం మీంచి మసీదు మీదికి
మసీదు మీంచి మందిరం మీదికి
చానాళ్లుగా తిరుగుతోంది ..
ఆకలి వేస్తె
నాలుగు గింజల కోసం
ఊరి వైపు ఎగురుతోంది...
------------------
మతములన్ని మాసి పోవును ..
మమతల దీపం నిలిచి వెలుగును ....
--------------------------

Tuesday, September 7, 2010

కొంచెం ...

కుంచె మొన కొంచెం ..
కదిల్తే రంగుల ప్రపంచం..
==============
కాగితం నా పొలం
కలం నా హలం
కవిత అందరి ఫలం ..!
==============
కనురెప్పల దూరం --ఇంత
కనువిప్పుకు లోకం --అనంత
===============
"అ " అంటే అక్షరం
పదాలుగా కదిలితే కావ్యం
==============
ఒంటరిగా నడిస్తే ..అది నడక
నలుగురితో నడిస్తే --అది బ్రతుకు.
==================
కవిత మొదలైనప్పుడు నీది
ముగుసినాక --అందరిది.
===============

Sunday, September 5, 2010

చినుకు

వాన చినుకు
ఎదలోపల పడి
ముంచివేసింది .
************
మంచుమొగ్గలు
గడ్డి పోచలపైన
మెరుస్తున్నాయి .
************
రోజంతా వాన
పనిలో పడి
మునిగింది గది.
*************

చినుకు

Monday, August 23, 2010

జన్మనిచ్చేది ...

జన్మ నిచ్చేది
అమ్మ ఒక్కటే కాదు..
అక్షర౦ కూడా..!
ఈ రోజు నా జన్మ దినం.
యాభై వస౦తాలు నిండిన క్షణం ..
ముందుకు పొతే ముసలి తనం..
వెనక్కి వెళితే పసిడితనం..
ఇలా ఉండిపొతే ఎంత బావుంటుందీ క్షణం..!

Tuesday, August 3, 2010

ఓ పువ్వు రాలుతు౦ది ....

నన్ను ఈ దారినే వెళ్ళనివ్వండి ..
ఇరువైపులా ఎదిగిన చెట్లు
నన్ను గుర్తుపట్టి
ఇంత నీడనీ -కొన్నిపూలనీ ఇచ్చాయి కదా ..!
---నాదోసిళ్ళ లోంచి
కాసిని నీళ్ళు పోసిన జ్ఞాపకం
నీడలా పరచుకుంది కదా ..!
కంచెవేసి కాపలా కాసానని
పూల పరిమాళాలని పంచింది కదా..!!
----నన్ను మోసు కెళ్ళేపుడు
ఈ దారినే వెళ్ళండి ..
ఒక్క క్షణమైనా
ఓ చెట్టు నీడలో ఆపండి.
తప్పకుండా ఓ పువ్వు రాలుతుంది నాపైన.