Friday, January 7, 2011

అందమైన తీరం

అలల్లో
అలలా కదిలే చందమామపై
చివురాకులు రాల్తున్నాయి.
రంగురంగుల పూలరేకుల ప్రతిబింబాలు
నదిలోతుల్లోపరిమళాల్ని దాస్తున్నాయి.
****ఇంతలో ఓ పడవ వచ్చి
ఈ అందమైన దృశ్యాన్ని
మెల్లగా లాక్కెళ్ళింది.
పడవని వెంటాడి
ఓ తీరంలో పట్టుకున్నాను.
పడవలోంచి చందమామలు
పొంగిపొర్లుతున్నాయి.
పూలరేకులు సీతాకోకల్లా ఎగిరిపోతున్నాయి.
వేలాది ప్రతిబింబాలు
నా మనసులో వొదిగి పోతున్నాయి.
దూరాన్నించి మరోపడవ వస్తోంది.
ఇహ ఈ తీరం వదిలి ఎలా వెళ్ళను??

Monday, January 3, 2011

పూలతీగ చెంపలకి రాసుకుంటూ

చాలా విషాదంగా బాధామయరేఖ నా చెంపల మీద ఏదో రాసుకుంటూ వెళ్ళింది. కన్నీటి చుక్క దాన్ని చేరిపెసేముందు చిరునవ్వు నన్ను మేల్కొలిపి నెమ్మదిగా నా తలని తన ఒడిలోకి తీసుకొంది. ఎవరివో, నునులేత తీగాల్లాంటి మొనదేలిన వేళ్ళు మెల్లగా నా తలలోకి చొచ్చుకుపోయాయి. మెత్తని బరువెక్కిన పెదవులు నుదురుమీద కుదురుగా ఆగి వెచ్చని స్పర్శకోసం ఎదురుచూస్తూ అందక జారిపోయాయి.
క్షణ కాలంలో కన్నీటి తడి ఆరిపోయి లోపలి బాధల్ని ఇంకెవ్వరికీ తెలీని మూలల్లోకి లాక్కెళ్ళి చిరుగాలితో ఏదో గుసగుసలాడి పూలతీగతో చెంపలకి రాసి వెళ్ళింది. నేనింక తీగచుట్టూ అల్లుకొని కొన్ని పూలని దోసిట్లో పోసుకొని ఆమె వెళ్ళే దారిలో పోసి అరచేత్తో అద్ది అద్ది ఉంచాను. కొన్నిపూలు గాలికి చెదిరి పక్కకు దొర్లాయి పరిమళిస్తూ..మరికొన్ని పూలు ఆమె రాక కోసం ఎదురుచూస్తూ నిశ్చలంగా అలానే ఉన్నాయి..నాకు తోడుగా ..చాన్నాళ్ళుగా ..

Tuesday, December 7, 2010

పాప కళ్ళల్లో ...

వాన వెలిసింది.
అంతపెద్ద ఆకాశంలో
ఇంద్రధనసు
ఏడురంగుల్లో మెరిసింది.
కానీ ......
పాప చిన్ని కళ్ళల్లో
వేయి రంగులతో మెరుస్తోంది.

హైకులు -3

ఆమె కనులు
తడవడమంటేనే
బతుకు సున్నా.
----------------
ఈ రెండు కళ్ళు
తడిసాక తెలిసింది
బతుకు లోతు.
----------------
కంట తడిని
తుడిచే వేళ్ళు౦టేనే
బతుక్కి అర్ధం.
----------------


తుడిచే velluntene

Monday, December 6, 2010

పొన్నచెట్టు నీడలో ..

పొన్నచెట్టు కింద
నిలబడ్డాను.
విరిసిన పూలు కొన్ని,
మరికొన్ని రాలిన పూలు
నాలోని అక్షరాలని
పలకరించాయి.
---కాలం పరిమళిస్తూ
నాకు తోడుగా ఉంది.

Wednesday, December 1, 2010

మోయలేని మనసు ..

హైకులు
======
కనురెప్పలు
తెలియని నదిని
దాచివుంచాయి.
---------------
కన్నీటి చుక్క
లోలోపలి బాధని
ఆరబోస్తోంది.
--------------
కన్నీటి చుక్క
బరువెంతో తెల్సింది
జారిపడ్డాక.
-----------
కంట తడిని
మోయలేని మనసు
చెంపకిచ్చింది.
--------------

Wednesday, November 17, 2010

నా నువ్వు- నీ నేను

నేనుతనంలో నువ్వు,నువ్వుగా నన్నుచేరుకొని ,నేను నేనుగా లేని క్షణంలో
నువ్వు నన్నుగా చేదుకొని ,నా నువ్వుగా ,నీ నేనుగా కలసిన వైనంలో
అనేకనేనులుగా విడిపోతున్న కాలంలో ,నువ్వు ఒక్క సారిగా మేల్కొని
వివిధనేనుల్ని ఏకంచేసి ,ఒకేఒక్క నువ్వు ,ఒకేఒక్క నవ్వుతో నన్నే ముడివేసి
కొన్నివేల నువ్వులుగా మారిన నువ్వు ,అనంత ప్రేమని పంచి ఇచ్చి
ఈ ఒక్క నేనుని అనురాగ ధారల్లో పడవేసి
నేనే నువ్వని- నువ్వే నేనని ,నేనుగా వేరే లేనేలేనని
నీవుగా నాలోలేని నేను, నేనుగా అసలు ఉన్నా లేనని
తెలిసిన అపురూప సమయంలో
నాకు నేనుగా నేకు ఇవ్వనా
అక్షరాలలోపెట్టి ఈ కవితని చిన్ని కానుకగా...!?