Monday, January 3, 2011

పూలతీగ చెంపలకి రాసుకుంటూ

చాలా విషాదంగా బాధామయరేఖ నా చెంపల మీద ఏదో రాసుకుంటూ వెళ్ళింది. కన్నీటి చుక్క దాన్ని చేరిపెసేముందు చిరునవ్వు నన్ను మేల్కొలిపి నెమ్మదిగా నా తలని తన ఒడిలోకి తీసుకొంది. ఎవరివో, నునులేత తీగాల్లాంటి మొనదేలిన వేళ్ళు మెల్లగా నా తలలోకి చొచ్చుకుపోయాయి. మెత్తని బరువెక్కిన పెదవులు నుదురుమీద కుదురుగా ఆగి వెచ్చని స్పర్శకోసం ఎదురుచూస్తూ అందక జారిపోయాయి.
క్షణ కాలంలో కన్నీటి తడి ఆరిపోయి లోపలి బాధల్ని ఇంకెవ్వరికీ తెలీని మూలల్లోకి లాక్కెళ్ళి చిరుగాలితో ఏదో గుసగుసలాడి పూలతీగతో చెంపలకి రాసి వెళ్ళింది. నేనింక తీగచుట్టూ అల్లుకొని కొన్ని పూలని దోసిట్లో పోసుకొని ఆమె వెళ్ళే దారిలో పోసి అరచేత్తో అద్ది అద్ది ఉంచాను. కొన్నిపూలు గాలికి చెదిరి పక్కకు దొర్లాయి పరిమళిస్తూ..మరికొన్ని పూలు ఆమె రాక కోసం ఎదురుచూస్తూ నిశ్చలంగా అలానే ఉన్నాయి..నాకు తోడుగా ..చాన్నాళ్ళుగా ..

1 comment:

  1. ఈ పూల తీగ మరీ మరీ బాగుంది.మీ భావుకతకు హృదయ పూర్వక అభినందనలు.

    ReplyDelete