Wednesday, February 16, 2011

పుస్తకాన్ని మూస్తే..

పుస్తకాన్ని తెరవాలంటే
ముందు మూసుకున్న నన్ను నేను తెరుచుకోవాలి.
అక్షరాల వెంబడి చూపులు సాగాలంటే
తక్షణం నాలోని బద్ధకపు క్షణాలని తగలబెట్టాలి .
అప్పుడే కదా
నిశ్శబ్దాన్ని శ్వాసిస్తూఅరచేతిలో పుస్తకం
ప్రాణం పోసుకుంటుంది..!
చాలావరకు చదివింతర్వాత
ప్రపంచం బొచ్చుకుక్కపిల్లలా
నా కాళ్ళదగ్గర 'కూతు కూతు'లాడుతుంది..!
పుటలు తిరగేస్తున్నకొద్దీ నా చేతి మునివేళ్ళ మీద
సూర్యోదయం కొత్త కొత్త కాంతుల్ని అద్దుతుంటుంది
ప్రతి శీర్షికా కవి హృదయాన్ని ఆవిష్కరిస్తూ
దివా రాత్రుళ్ళలో కవనపరిమళాల్ని
నాముంగిట్లోనింపుతుంది.
నాచుట్టూ ఎవరో తచ్చాడుతున్నట్లుగా
చాలాకాలపు ఒంటరితనాన్ని సవాలుచేస్తూ
కొన్ని బారాటి నీడలు పరచుకుంటాయి.
పుస్తకాన్ని మూసిన ప్రతి సారీ
నన్నెవరో యధేచ్చగా పరిచయం చేస్తున్నట్లుగా ఉంటుంది.
భుజం మీద ఆప్యాయంగా చేయి వేసినట్లుగా ఉంటుంది.
అడుగుతీసి అడుగు వేసినప్పుడల్లా
ఎవరివో అరచేతులు
నా పాదాల కింద చేరుతున్నట్ట్లుగా ఉంటుంది.
పుస్తకాన్ని మడిచిన ప్రతిసారీ
నా గమనం సుగమమై
గమ్యం సుస్స్పష్ట మౌతుంది.
వాక్యానంతర చుక్క దగ్గర
నన్నెవరో విడమరచినట్ట్లుగా ఉండేది.
అర్ధమౌతున్న కొద్దీ
నాకు నేనే అన్తుబడుతున్నట్ట్లుగా ఉండేది.
కొన్ని పదాల మధ్య విరామంలో
అంతర్యుద్ధాని చూసేవాడిని.
పుస్తకాన్ని మూయాలని పించదు.. .
మూయకపోతే
నేనెలా తెరచుకుంటాను.!!?

5 comments:

  1. కొన్ని పుస్తకాలు చదివిన ప్రతీసారి
    కొత్త విషయాలని కొత్తగా జ్ఞానాన్ని ఇస్త్తాయి
    పుస్తకం గొప్పదనం సంగతి అటుంచితే
    మన ఆలోచనా పరిది ప్రతీసారి విస్తారమైనట్టు మనకు తెలుస్తుంది...
    నిజానికి పుస్తక పఠనంలో కనుక్కునేది, వెతుక్కునేది మనలని మనమే...
    చాలా చాలా బాగారాసారు..స్ఫూర్తివంతమైన భావం...

    ధన్యవాదాలు రాంప్రసాద్ గారు!

    ReplyDelete
  2. Many many thanks for your nice responce..yes.. your comment is 'SATYAM'

    ReplyDelete
  3. చాలా బాగుంది మోహన్ రామ్ ప్రసాద్ గారు.

    ReplyDelete
  4. పుస్తకాన్ని మూసిన ప్రతి సారీ
    నన్నెవరో యధేచ్చగా పరిచయం చేస్తున్నట్లుగా ఉంటుంది.
    భుజం మీద ఆప్యాయంగా చేయి వేసినట్లుగా ఉంటుంది.chala bavundandi...
    http:/kallurisailabala.blogspot.com

    ReplyDelete