Monday, February 20, 2012

రాలని పూలు

1   పారిజాతాలు
నేలమ్మ పూచిందని
నీడ చెప్పింది.

2   నీలికొమ్మకు
నక్షత్రాలు పూచాయి
రాలని పూలు

3 .
రాలిన పూలు
నేలమీద కదుల్తూ
ఎటు వెళ్తాయో !

4 . 
చిన్న చినుకు
పూలు, మట్టివాసన 
జతకట్టాయి.

5 .
మల్లెపువ్వులు
రాత్రంతా వెన్నెలని
దాచుకున్నాయి.

6 .
చీకటి చెట్టు
రాత్రేమి జరిగిందో
పొద్దుపూచింది


Thursday, December 29, 2011

మా ఊరి హైకూలు 101 .

91 .
పచ్చని పైరు
నిత్యం పారే యేరు
మా ఊరికి౦కేం కావాలి

92 .
తలలూపుతూ
వరిచేలు -రమ్మనో
వెళ్లి పొమ్మనో

93 .
ఊరు తెన్నేరు
అక్షర సంపదని
ఇచ్చిన ఊరు

94 .
గోళీలు గూటీ బిళ్ళలు
ఒంటినిండా దుమ్ము
మా పిల్లలకి అంటుకోలేదు

95
గోడలమీద బోలెడు
 geetalu గీసేవాళ్ళం
పికాసోకు తెలుసు

96
మా పందిరి మంచం
తాతయ్య గుసగుసల్ని
దిండుకింద దాచింది

97 .
తెలుగు మాస్టారు
పద్యానికి అర్ధం చెబుతుంటే
అమ్మ ముద్డ కలుపుతున్నట్లు౦డేది

98 .
బడికెళ్ళేదారిలో
పెద్దపెద్ద చెట్లు
నీడనివ్వడం నేర్పాయి

99 .
నల్లకలువలు
మాచెరువులో మొగ్గతొడిగి
ఆకాశంలో వికసిస్తాయి

100 .
మాఊరి చెరువు
ఉన్నట్టుండి అలల్లో
ఆకాశాన్ని దాచేస్తుంది

101  ఆఖరి రోజు
మాస్టారు తలనిమిరారు
కవిత్వం తలకెక్కింది .

[ హైకూ రాయందే
ఊరూ యేరూ వెన్నెల
ఉండనివ్వవు నన్నిలా ]



Sunday, December 25, 2011

మా ఊరి హైకూలు 90

84 .
ఆడపిల్లలందరూ
హాజరైన రోజు
లెక్కలు తికమక

85 .
మా ఊరిలోపల
మరోఊరు ఉంది
అక్కడంతా ఒక్కటే

86 .
రైలాగినప్పుడల్లా
మా గొడ్డకాడిబుడ్డాళ్ళు
ఇటెక్కి అటుదిగేవాళ్ళు

87 
పలకా బలపం పోయినా 
మా బడి నన్ను ఓదార్చి 
తీర్చిదిద్దింది

88 
నా చిన్నప్పటి చందమామని
పిల్లలకు చూపించాను
మా ఊరు తీసుకొచ్చి

89 
ఊరుకి వెళతానా
ఊరికే ఉండదు
ఊరించి హైకూనిస్తుంది

90 
మా జొన్న చేను
ఆకలిని జయించే
ఆయుధాన్ని విసుర్తోంది



Friday, December 23, 2011

మా ఊరి హైకూలు 83 .


77  చిట్టి గోరింట చేతుల్ని
నా కళ్ళకు ఆన్చేది
ఇప్పుడు ఇక్కడుందో

78
పరికిణి వేసుకున్నాక
పదోతరగతి మానేసింది
తెలుగెంత అందంగారాసేదో

79 
ఎనిమిదో తరగతిలోనే
ఎంకట లక్ష్మికి పెళ్లి
ఏడు కిళ్ళీలు తిన్నాం

80 
వొడుపుగా వరినారుని
రెండువేళ్ళతో నాటేవారు
హైకూ నేర్చుకుంది అక్కడే

81 
నేనొక పాటరాసి
ఊళ్లోకి వెళ్లాను
మాపాలేరు పాడేదిఅదే

82 
చింతతోపుల్లోంచి
చందమామని చూస్తే
మాఊరు కన్పిస్తుంది

83 .
గట్లు తిరగేయడం
నాట్లు వేయడం చూసాక
పాట కట్టడం నేర్చుకున్నా

Thursday, December 22, 2011

మాఊరిహైకూలు 76.

73 . మా జోడేడ్డ్లు
కాడిని మెడకేసుకుంటాయి
బాధ్యత బరువనిపించదు

74 . మాబడి దగ్గర
బావి ఎండిపోయింది
చిన్నప్పుడు ఒంటేలు పోసేవాళ్ళం

75 . వానొచ్చిందని ఇళ్ళకెళ్లమంటే
ఇంద్రధనసు కోసం
పొలాల్లోకి వెళ్ళేవాళ్ళం

76.  పంట బండ్ల కేత్తాక
దిష్టి బొమ్మని పడేసేవాళ్ళం
ఇహ చేలో పిట్టలు వాలేవి


Tuesday, December 20, 2011

మాఊరి హైకూలు 72

67 . ఆ ఇంటిమీది కాకి
ఈ ఇంటిమీద వాలేది
కాకులకు కులాల కుళ్ళు లేదు

68 మాల మాదిగలని
తెలిసేది కాదు
మా ఊరివారని తెలుసు.

69 అదేవెన్నెల
 అవే మనసులు
ఊరేం మారలేదు 

70 వరికోతలకి ఆడవాళ్ళు
కొడవళ్ళతోనూ
కొన్ని పాటలతోనూ

71 . అందరం కట్టుకున్న
ఇసుకగూళ్లు లేవు
ఇప్పుడు ఎవరిళ్లు వారివే

72 మా ఊరు వెళ్తానా
తాటిచెట్ల బారాటి నీడలు
చేతులు చాస్తాయి

Monday, December 19, 2011

మా ఊరి హైకూలు 66

61 . అమావాస్య రాత్రి
కల్లంలో కాపలాకి
మిణుగురులు నాకు తోడు

62 . చేల గట్లమ్మట
ఎగురుకుంటూ మేం
మా చుట్టూ సీతాకోకలు

63   తిరణాల్లో
చింతామణి నాటకం
ఊరునిద్రపోఎదు కాదు

64 . వాడికి కుడికాలు లేదు
నామెడమీద కూర్చొని
బడికితీస్కేల్లెవాడు

65 . రాములవారి గుళ్ళో
గంట అందేది కాదు
అమీరు ఎత్తుకునేవాడు

66 . హిందీ మాస్టారి
హనుమంతుడి వేషం
తోకకి నిప్పుపెట్టేవాళ్ళం