Friday, April 30, 2010

దారి

నాకు దారంటే ఇష్టం .
పదినప్పుడులేపి -దుమ్ముదులిపి
అమ్మలా నడిపించే దారంటే ఇష్టం.
ఇరువైపులా ఎదిగి
వినయంగా తలలు వంచిన
పూలమోక్కలన్నా ఇష్టమే.
వేనుతిరగని -అలుపెరగని
నా పయనంలో
నీడనిచ్చి-సేదదీర్చి
తలనిమిరి ప్రేమగా సాగనంపే
దారిపక్కని చెట్లన్నా ఎంతోఇష్టం.
దారిపక్కన గట్ట్లని ఒరుసుకుంటూ
ప్రవహించే ఏరన్నా ఇష్టమే.
ఉద్యమిస్తూ -నినదిస్తూ
ఊరేగి౦పులో ఆనవాళ్ళని గుర్తిస్తూ
ఓనమాలు దిద్దించే
అమ్మలాంటి దారంటే చాలా ఇష్టం.

Monday, April 26, 2010

ఏటి ఒడ్డున కాసేపు..

ఏటి ఒడ్డున పూలచెట్టు
మృదువుగా ఊగుతోంది .
ప్రతి అలా
పూలప్రతిరూపాల్ని
అపురూపంగా మోసుకెల్తున్నాయి
ఆవలి ఒడ్డున
అలసి ఆగిన పడవ
తడవ తడవకీ ఉలిక్కి పడుతోంది .
సాయంత్రాన్ని పెనవేసుకుంటూ
చిరుగాలి పరిమళిస్తోంది..
తొలిసంద్యనినెమరేసుకుంటూ
పరవశిస్తూ ఓ కవి ..
ఇరు తీరాలని ముడివేసుకుంటూ
ప్రవహిస్తూ యేరు..
కూటి కెళ్ళిన పక్షులు
గూటికి చేరుతూ కువకువలు..
తగుల్తున్న అలల్లో
జారిన జ్ఞాపకాలని
తడుముకుంటూ
ఏటి ఒడ్డున నేను.





Thursday, April 22, 2010

ధరణి దినోత్సవం

చేలకు గట్లు
సరిహద్దులు గీస్తూ ..
భూమి నవ్వింది .
---------------
బొంగరం
గిర్రున తిరుగుతోంది
భూమి నవ్వుకుంది .
----------------
ఏ కవి చల్లాడో
వేల అక్షరాలు
నేల ,పచ్చని కవిత నిచ్చింది .
-------------------

రంగుల కల

గొంగళి పురుక్కి నిద్ర చెడింది
రంగుల కలలన్నీ
రెక్కలిప్పుకున్నాయి .
------------------
రంగులన్నీ నేలపాలు
పాప అరచేతిలో
ఆధునిక చిత్రం .
----------------
నా ముంగిట్లో మృత్యువు
ఒక్కో రాయి ఏరుతోంది
నా గడియారంపై విసరడానికి.
-------------------


Tuesday, April 20, 2010

కొత్త పల్లవి

యవ్వనం
ఓ భీభత్స రస ప్రధాన గీతిక
ఎప్పుడూ కొత్త పల్లవినే రాసుకుంటుంది .
--------------------
చందమామ
సంద్రమై పొంగింది
వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లల్ని చూసి.
--------------------
స్నేహం
ఓ వింతగాయం
ఇద్దరికీ ఒకే చోట తగిలి మాయమైంది .
--------------------

Tuesday, April 13, 2010

వెన్నెల లాంటి ..

వెన్నెలలాంటి ఆమె భుజాలమీంచి నల్లనిత్రాచు మెల్లగా ప్రాకి పొంగుతున్న గుండెల మీద ఊగిసలాడే
పూలదండనివాసన చూసి సన్ననడుంని చుట్టూరా చుట్టుకొని నాభిలోకి జారిపోగానే తెల్లని ఓ పూమొగ్గ బిగుసుకున్న రేకుల్ని సౌమ్యంగా విప్పుకుంటూ కెవ్వునపెట్టినకేకకి గుడి శిఖరం మీద అటునిటు తిరిగే
పావురాయి కువకువ లాడుతూ వేకువని ముక్కున కరచుకొని ఆకాశాన్ని పొడుచుకుంటూ పడమర దిక్కుకి
సూటిగా చూస్తూ రెక్కల్ని సారించి నిన్నటి జ్ఞాపకాల్ని విసిరేసింది.

Monday, April 12, 2010

జొన్న చేను

మా జొన్న చేను
ఆకలిని జయించే
ఆయుధాన్ని విసుర్తోంది.
---------------
మా జొన్న పంట
పిట్టలకింత పంచి
ఇంటికొచ్చింది .
-------------
మా జొన్న చేలల్లో
ఇంకా దిష్టిబొమ్మ ఉంది
ఎంత భాద్యత ..!

Wednesday, April 7, 2010

పిట్టలు

రెక్కలోచ్చాక
లెక్కలేస్తోందిపిట్ట
కొత్తగూటికి
------------
రెట్టను వేసి
ఎటో చూస్తింది పిట్ట
పెట్టింది పని.
--------------
బాణం గురి తప్పింది
పిట్ట ఆనందానికి
రెక్కలు చాల్లేదు.
---------------

Friday, April 2, 2010

ఇచ్చుకోని..

నన్నునీకు ఇచ్సుకోనీ
ప్రేమగీతి విచ్చుకోనీ !
ఎదలోపలి మమతలన్నీ
నీ పాదాల సమర్పించుకోనీ ..!!
౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
నేన్నీకు ఎమౌతానని
ఇన్నిన్ని పువ్వులు
దోసిట్లో పోస్తావు..!?
నేన్నీకు ఎమీకానని
తెలిసాక నిర్దయగా
చీకట్లోకి తోస్తావు.. !!
0000000000000

Thursday, April 1, 2010

రాసుకున్న పాట..

ఆకాశం
ఓ పాట రాసుకుంది
అది వెన్నెలై కురుస్తోంది.
========
విచ్చిన పువ్వు
ఓ పాట పాడుకుంది
తోట పరిమళించింది.
==========
పడవ
రాసుకున్న పాటని
అలలకిచ్చింది.
--------